ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వొస్తారు..
మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 31: ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వస్తుంటారని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పిసబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ ను చూసి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెల గూడ లోని బీరప్ప గడ్డ వద్ద కురుమ బంధువుల ఆత్మీయ సమ్మేళనానికి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు రాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచకుండా, ఫలితాలు రాగానే పెంచుతా రన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.400కే వంట గ్యాస్ అందిస్తారని అన్నారు. రూ.2 వేలు ఉన్న ఆసరా పెన్షన్లు రూ.5 వేలు, రూ.4 వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ రూ.6 వేల వరకు పెంచబోతున్నట్లు తెలిపారు. మహిళలకు ప్రతి నెల సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా రూ.3 వేలు అందిస్తామని, రైతు భీమా లాగా రాష్ట్రంలోని 93 లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు భీమా సౌకర్యం కలిస్తామన్నారు. జిల్లా కురుమ సంఘం భవనానికి ఒక ఎకరా స్థలం కేటాయించటానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ నిధుల నుండి యెగ్గే మల్లేశం కోటి రూపాయల నిధులు ఇవ్వాలని సూచించారు.
నియోజకవర్గములోని బడంగ్ పేట్, మీర్ పేట్, తుక్కుగూడ, జల్ పల్లి జంట కార్పొరేషన్లు, జంట మున్సిపాలిటీలలో రూ.832 కోట్ల రూపాయల భారీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో ట్రంక్ పైపు లైన్లు, నాళాల నిర్మాణాలతో వరదనీటి ముంపు సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. నాలాల అభివృద్ధికి రూ 110 కోట్లతో మహేశ్వరం నియోజక వర్గంలో పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేయటానికి రూ.280 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు, నూతన పైప్ లైన్లు, ట్యాంకులు, రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో బడంగ్ పేట్, మీర్ పేట్, జల్ పల్లి, తుక్కుగూడ ల పరిధిలోని 11 చెరువులలో రూ.40 కోట్లతో అభివృద్ధి, సుందరికరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు రూ.6600 కోట్లతో మెట్రో నిర్మాణం చేపడతామన్నారు. నియోజకవర్గములో మెడికల్ కళాశాలకు కూడా శంకుస్థాపన చేసినట్లు వచ్చే విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి వస్తుందన్నారు.
మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడుతూ.. ఒక తల్లి లాగా మంత్రి సబితమ్మ మహేశ్వరం నియోజకవర్గానికి ఒక పెద్ద దిక్కుగా కోట్లాది రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. ఒకే రోజు 80 కార్యక్రమాలు చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి దేశ చరిత్ర సృష్టించారన్నారు. స్వర్గీయ ఇంద్రన్నను మైమరిపించేలా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ.. సమస్యల పరిష్కారంలో ముందు ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో ఈ ప్రాంతానికి వేల కోట్లు నిధులు తెచ్చారని అన్నారు. కురుమ కుల బంధువులందరు సబితమ్మకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. జిల్లెల గూడలో కురుమ సంఘం భవనానికి ఎమ్మెల్సీ కోటా నుంచి రూ.10 లక్షలు ఎన్నికల తర్వాత కేటాయిస్తానని పేర్కొన్నారు. విద్యా శాఖ మంత్రిగా పాఠశాలల రూపు రేఖలు మార్చి ఘనత సబితా ఇంద్రారెడ్డికే దక్కిందన్నారు. దీంతో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు దొరకని విధంగా డిమాండ్ పెరిగిందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు క్యామ మల్లేశం మాట్లాడుతూ.. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ సమస్యలు పరిష్కరించే గొప్ప నాయకురాలు సబితమ్మ అని కొనియాడారు.
ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న సబితా ఇంద్రారెడ్డిని గెలిపించి మరింత అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా నేడు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించింది అంటే, జిల్లాలో రూ.100 కోట్లకు ఎకరా భూమి ధర పలుకుతుంది అంటే, పరిశ్రమల స్వర్గ ధామంగా మారింది అంటే, అందులో సబితమ్మ కృషి ఎంతో గొప్పగా ఉందన్నారు. ఒక విజన్ తో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సబితా ఇంద్రారెడ్డికి ప్రతి ఒక్కరు అండగా నిలబడి మద్దతు తెలుపలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్నపూర్ణగా మారింద న్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భుపేష్, కార్పొరేటర్లు సిద్దలా లావణ్య, అనిల్ కుమార్, బీరప్ప, పద్మ అంజయ్య, వేముల నర్సింహా, రామచందర్ ఎల్, ఇంద్రావత్ రవి నాయక్, జ్యోతి కిషోర్, నవీన్ గౌడ్, గౌరీ శంకర్, రవి నాయక్, శ్రీను నాయక్, కురుమ సంఘం అధ్యక్షులు భరత్, అగమయ్యా, దీప్ లాల్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.





