కారును వెనుక నుండి ఢీ కొట్టిన లారీ…ఆరుగురు మృతి
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్
మిర్యాలగూడ, ప్రజాతంత్ర, జనవరి, 29 : వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. దైవ దర్శనం కోసం తమ పిల్లలను తీసుకుని ఆనందంగా విజయవాడ, మోపిదేవి క్షేత్రాలను దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. మరో నిమిషంలో ఇంటికి చేరుకుంటామని తెలిసి అందరూ అనుకుంటూ ఉండంగానే లారీ రూపంలో ఆ కుటుంబాన్ని మృత్యువు కౌగిలిలోకి తీసుకువెళ్ళింది. మరో నిమిషంలో ఇంటికి వెళ్లాల్సిన వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాల పాలయిన సంఘటన నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ అద్దంకి`నార్కెట్‌పల్లి హైవేపై ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడలోని నందిపాహాడ్కు చెందిన చెర్వుపల్లి మహేష్(32), హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. కాగా ఇతని కుటుంబసభ్యులు అయిన ఆయన భార్య జ్యోతి(30), కుమార్తె రుషిక(6), మహేష్ తోడల్లుడు, యాదాద్రి జిల్లా, వలిగొండ మండలం, గొల్లేపల్లికి చెందిన భూమా మహేందర్ (32), మహేందర్ కుమారుడు లియాన్సి(2)లు అందరూ కలిసి జనవరి 26న విజయవాడకు వెళ్లారు. అటు నుండి మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం 28 సాయంత్రం కారులో వీరందరూ మిర్యాలగూడ ఫ్లైఓవర్‌ను దాటుకుని నందిపహాడ్ చౌరస్తా సమీపంలోకి వొస్తుండగా అతివేగంతో వొస్తున్న ఓ లారీ వెనుక నుండి కారుని బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ఫల్టీలు కొడుతూ నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృత్యువాత పడ్డారు. కాగా మహేందర్ భార్య భూమా మాధవి తీవ్రంగా గాయపడడంతో మెరుగైన చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ మాధవి మృతి చెందింది. సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు టుటౌన్ ఎస్సై కృష్ణయ్య తెలిపారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌కి తరలించగా సోమవారం ఉదయం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకుని మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. సంతోషంగా హైదరాబాద్‌కు తిరుగువెళ్తున్న సమయంలో సొంత గ్రామమైన నందిపహాడ్లో విశ్రాంతి తీసుకోవడం కోసం వెనుదిరిగిన వీరు శాశ్వత నిద్రలోకి వెళ్లడం పలువురిని కంటతడి పెట్టించింది. అభం శుభం తెలియని చిన్నారులు నిద్ర పోతున్నట్లుగానే ఉండటం..విగతజీవులుగా వారిని చూడలేక పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయితే మిర్యాలగూడలోని ఫ్లైఓవర్ దాటిన తర్వాత చిల్లాపురం కూడలి నుండి నందిపహాడ్ కూడలి వరకు రోడ్డు అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.





