- యథేచ్ఛగా నల్ల బజారుకు రాయితీ బియ్యం
- నిత్యకృత్యంగా మారిన బియ్యం అక్రమ రవాణా
- గుదిబండగా కిలో రూపాయి బియ్యం పథకం!
- ఆదాయం పెరగాలంటే…కిలోబియ్యం పోవాల్సిందే !
ఆదాయ మార్గాలపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు గుదిబండ లాంటి బియ్యం పథకాన్ని మాత్రం కదిలించడం లేదు. ఇబ్బడిముబ్బడిగా పెన్షన్లు, రేషన్ కార్డులు, కిలో రూపాయి బియ్యం పథకాలను సవిూక్షించకుంటే గుదిబండగా మారి, ప్రజల ఆదాయాన్ని కొల్లగొడుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం అందచేస్తున్న ఈ కిలో రూపాయి బియ్యం పథకం ప్రస్తుతం గుదిబండగా మారింది. కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామంటున్న పాలకులు ముందుగా పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించాలి. వారికి మాత్రమే రేషన్ కార్డులు ఇవ్వాలి. కేవలం బియ్యం కార్డులు మాత్రమే ఇవ్వాలి. ఎపిలో అధికారం చేపట్టిన సిఎం చంద్రబాబు ప్రక్షాళన ఈ దిశగా మొదలు పెడితే మంచిది. దాదాపు 41 ఏళ్ల కిందట పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆరామారావు కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ప్రవేశ పెట్టారు. కానీ ఇప్పుడు అదే బియ్యం ధర 40 నుంచి 50కిచేరింది. కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిలో రూపాయకే బియ్యం ఇస్తున్నారు. ఈ బియ్యాన్ని అమ్ముకోవడం, వ్యాపారం చేసుకోవడం అన్నది జరుగు తోంది.
చాలామంది హోటళ్లకు అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై దాదాపు 20రూపాయలకు పైగానే సబ్సిడీ ఇస్తోంది. ఇలా ఖర్చుతో కూడుకున్న పథకం అమలు చేయడం ఎంతవరకు న్యాయం. ప్రజల డబ్బును ఇలా అధికారికంగా దుర్వినయోగం చేయడం సరికాదు. ఖచ్చితంగా సవిూక్షించాల్సిన పథకాల్లో కిలో రూపాయి బియ్యం పథకం ముందు వరసలో ఉంటుంది. చంద్రబాబు మాత్రమే దీనిని తొలుత సవిూక్షించి నిర్ణయం తీసుకోగలరు. కొత్తివిూర పది, ఉల్లిగడ్డలు 50కి చేరిన తరుణంలో ఇంకా కిలో రూపాయికే బియ్యం ఇస్తామంటే కుదరదు. ఇది ప్రజలను వంచించడం తప్ప మరోటి కాదు. గతంలో ఇదే పథకాన్ని సవిూక్షించి కిలో 5 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుది. ఉమ్మడి ఎపిలో ఆయన దీనిని సవిూక్షించి, ప్రజాభిప్రాయంతో 5 రూపాయలకు కిలో బియ్యం చేశారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి సిఎం అయ్యాక దీనిని కిలో రూపాయి బియ్యంగా మార్చి దివాళా పథకంగా చేశారు. ప్రజల డబ్బును దుబారా చేస్తున్న ఈ పథకం విధానాన్ని విధిగా సవిూక్షించాలి.

పక్కదారి పడుతున్న పథకంపై కన్నేయాల్సిందే. నిరుపేదలకు ఉచిత పథకాలపై సవిూక్షించకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఆర్థికమాంద్యం కూడా తీవ్ర ప్రభావం చూపగలదు. ప్రజలు చెమటోడ్చి పన్నుల రూపంలో కట్టిన డబ్బులు వృధా పథకాలతో దుబారా చేస్తున్న పథకాలకు చరమగీతం పలకాలి. ప్రజల డబ్బులకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులు తమకు అనుగుణంగా, వోటు బ్యాంక్ రాజకీయాల కోసం పథకాలను కొనసాగించడం సరికాదు. నిరుపేదల కడుపు నింపడానికి పంపిణీ చేయాల్సిన రాయితీ బియ్యం యథేచ్ఛగా నల్ల బజారుకు తరలి అక్రమార్కుల పరం అవుతోంది. సిబ్బంది కొరత, కొరవడిన తనిఖీలకు ప్రజల అమాయకత్వం జత కలవడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పింది.
బియ్యం అక్రమ రవాణా చేయడం నిత్యకృత్యంగా మారినా అరికట్టాల్సిన అధికారులు చేష్టలుడిగి ప్రేక్షక పాత్రకు పరిమితమవుతున్నారు. రేషన్ దుకాణాల సమయపాలనకు తిలోదకాలు ఇవ్వడం, నిత్యావసర సరకులు వచ్చినా రాలేదని గద్దించడం, కార్డులను డీలర్లు తమ వద్దే ఉంచుకొని బియ్యాన్ని స్వాహా చేస్తూ రాష్ట్రాలను దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అమాయక ప్రజలు చేసేది లేక ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు బియ్యం అందచేయాలన్న లక్ష్యంతో కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని అమలు చేశారు. ఆనాడది సంచలన నిర్ణయంగా నిలిచింది. ఆ తరవాత చంద్రబాబు సిఎం అయ్యాక దానిని ఐదు రూపాయలకు పెంచారు. దీంతో కొంత దుబారా తగ్గిందనే చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ కిలో రెండు రూపాయలకు చేశారు. ఇలా చేయడం వల్ల కేవలం వోటు బ్యాంక్ రాజకీయాలు దాగి ఉన్నాయి. దీనిని కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ కిలో రూపాయికే మార్చడం ద్వారా అక్రమాలకు తెరలేపారు. కిలో రూపాయికి బియ్యం ఇవ్వడం వల్ల ఏదో ఘనకార్యం చేశామని గొప్పగా ప్రకటించుకున్నారు.
రూపాయికి కొత్తివిూర కూడా లభించని ఈ రోజుల్లో ఇంకా ఈ పథకాన్నికొనసాగించడం ఆర్థిక భారం తప్ప మరోటి కాదు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో అనేక పథకాలను సవిూక్షించాల్సి ఉంది. బియ్యం పథకంపై ఆజమాయిషీ లేకపోవడం వల్ల చౌక బియ్యాన్ని తినడానికి బదులు అమ్ముకోవడానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది కొందరికి వనరుగా, మరికొందరికి ఆదాయ వనరుగా మారింది. ఈ బియ్యంతో హోటళ్లలో టిఫిన్లు తయారవు తున్నాయి. అలాగే సరిహద్దులు దాటి సన్నబియ్యంగా మారుతున్నాయి. పాలకుల దూరాలోచన లేని కారణంగా ఈ బియ్యం కేవలం వ్యాపార దృక్పథంతో సాగుతున్నాయి. తెలంగాణ జిల్లాలకు మహారాష్ట్ర అతి సవిూపంలో ఉండటం, అక్కడ బియ్యం ధర అధికంగా ఉండటంతో పేదల ఆకలి తీర్చాల్సిన రాయితీ బియ్యాన్ని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రైళ్లలో అక్రమ రవాణా జరుగుతున్నా, బియ్యాన్ని పోలీసులు పట్టుకోవడం నిత్యం జరుగుతున్నా అవకతవకలకు అడ్డుకట్ట పడడం లేదు.
చౌకధరలకు తీసుకుని బయట అమ్ముకునే వారిని గుర్తించి తొలగించడం లేదు. కార్డులు తగ్గించకున్నా అక్రమాలపై దృష్టి పెట్టడం లేదు. పేదలకు బియ్యం అందించాలన్న సదుద్దేశ్యాన్ని ఎవరూ కాదనలేరు. కానీ రూపాయికే ఇవ్వాలనుకోవడం, అలా ఇచ్చిన బియ్యం అక్రమంగా తరలకుండా కఠినంగా చర్య తీసుకోకపోవమే ఆక్షేపణీయం. అందుకే ఆదాయవనరులపై దృష్టి పెట్టేముందు..దీనిని సవిూక్షించి దుబారా అరికట్టగలిగితే ఆదాయం కిందనే చూడవొచ్చు. వేలకోట్లు ఈ పథకం కోసం ఖర్చవుతున్నా మళ్లీ సవిూక్ష చేయలేక పోతున్నారు. ఎక్కడ వోట్లు పోతాయో అన్న అభయం వెన్నాడుతున్నట్లుగా ఉంది. రేషన్ కార్డులు తగ్గించడమంటే పేదవారికి బియ్యం దక్కకుండా అడ్డుకోవడం కాదు. రేషన్ బియ్యం తినే ప్రతిఒక్కరికీ బియ్యం అందిస్తాం అంటూ ప్రజలు కట్టే పన్నులకు పాతరేస్తున్నారు. దీనిపై సవిూక్షించి కఠినంగా వ్యవహరించడంతో పాటు కిలో రూపాయిని కనీసం ఐదు రూపాయలకు పెంచాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తాన్ని రైతుల కు మద్దతు ధరలకు కేటాయిస్తే మరీ మంచిది.
-సమీర్





