92 కిలోల ఎండు గంజాయి పట్టివేత

– విలువ రూ.46 లక్షలు
– ముగ్గురు నిందితుల అరెస్ట్
– రామచంద్రాపురం ఏసిపి శ్రీనివాస్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జనవరి 12: సైబరాబాద్ కమిషనర్ పరిధిలో నమ్మదగిన సమాచారంతో ముత్తంగి రింగ్ రోడ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వాహనంలో గంజాయి పట్టుబడ్డ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో రామచంద్రాపురం ఏసిపి వై.శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం నుండి మహారాష్ట్రకు అవుటర్ రింగ్ రోడ్ మార్గం ద్వారా గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ సమాచారంపై వెంటనే పటాన్ చెరు, ఎస్ఓటి సిబ్బంది, ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం అవసరమైన విధానాలను పాటిస్తూ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆదే రోజు సాయంత్రం పటాన్ చెరు సమీపంలోని ముత్తంగి టోల్ ప్లాజా సమీపంలో ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం అనుమానాస్పదంగా ఉన్న రెండు వాహనాలను పోలీసు బృందాలు తనిఖీ చేయగా వాహనాలు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నాయన్నారు. నేరస్థులను, వాహనాలను మధ్యవర్తుల సమక్షంలో తనిఖీ చేయగా, భారత్ బెంజ్ వాహనం నుండి 19 ప్యాకెట్ల ఎండు గంజాయి లభించిందని అన్నారు. వాటి బరువు 92 కిలోలు ఉన్నదని తెలిపారు. ఎండు గంజాయి విలువ రూ.46 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితులు సచిన్ గంగారం మారుతి చవాన్, మహేష్ రవీంద్ర వటకర్, విజయ్ చవాన్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామ‌న్నారు. విచారణలో నిందితులు గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతం నుండి గంజాయిని సేకరించి మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నట్లు వెల్ల‌డైందని చెప్పారు. గంజాయి, అక్రమ రవాణాకు ఉపయోగించిన రెండు వాహనాలను స్వాధీనం చేయడమైందని తెలిపారు. ఒడిశాలోని పరలాఖేముడి ప్రాంతానికి చెందిన జాఫర్ అనే వ్యక్తి ఈ గంజాయిని నిందితులకు సరఫరా చేయుచున్నట్లు తెలిసిందని అన్నారు. గంజాయిని మహారాష్ట్రలోని సోలాపూర్ కు చెందిన అజిత్ జన్తాప్ కు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తెలిసిందని ఏసిపి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పటాన్ చెరు సీఐ వినాయక రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాజు, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, ఎస్ఓటి ఎస్ఐ రామ్ నారాయణ, పటాన్ చెరు ఎస్ఐలు విద్యాచరన్, మహమ్మద్ ఆసిఫ్, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *