– అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేసిన పట్టణ ప్రజలు
– రెండు కార్పొరేషన్లలో హంగ్
– బీఆర్ఎస్, బీజేపీ కట్టు కథలను నమ్మని ప్రజలు
– అత్యున్నత ప్రమాణాలతో పాలన అందిస్తాం
– గాంధీ భవన్లో డిప్యూటీ సీఎం భట్టి ప్రెస్మీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల ఎన్నికల్లో ఇప్పటివరకు అందిన ఫలితాల మేరకు 83 మున్సిపాలిటీలు, ఐదు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉందని, తమ స్థానాలు మరిన్ని పెరుగుతాయని చెప్పారు. స్వతంత్రులు, ఇతర పార్టీల వారు తమతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారని, మొత్తంగా 90 నుంచి 94 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో జమ అవుతాయని స్పష్టం చేశారు. ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా ఐదు కార్పొరేషన్లలో కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీ సాధించిందని, రెండుచోట్ల హంగ్ ఏర్పడిందని తెలిపారు. అక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు ఉన్నారు.. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అన్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున మున్సిపల్ స్థానాలు రావడం సంతోషం కలిగించే విషయం అన్నారు. అభివృద్ధి, సంక్షేమం విశ్వసనీయతకు రాష్ట్ర ప్రజలు పెద్దపీటవేశారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని, రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని ఈ ఫలితాలతో తేటతెల్లమైందని డిప్యూటీ సీఎం తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రతిరోజూ గాలి కబుర్లు చెబుతూ కట్టు కథలు వినిపిస్తూ ప్రభుత్వంపైన. కాంగ్రెస్ పార్టీపైన చేస్తున్న విమర్శలను గమనించి రాష్ట్ర ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన తీర్పును ఇచ్చారన్నారు. పట్టణ ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో ప్రజా ప్రభుత్వం బాధ్యత మరింత పెరిగిందని, అత్యున్నత ప్రమాణాలతో పాలన అందిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో, ఆ తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో వరుసగా ప్రజా ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని, ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని సూచించారు. ప్రసార మాధ్యమాల్లో కనిపించాలని, ప్రజల్లో ఉనికిని కాపాడుకోవాలని ప్రతిపక్షాలు కట్టు కథలు అల్లడం, తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని, రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండాలని ప్రజాస్వామ్య వాదిగా తాను బలంగా కోరుకుంటానని డిప్యూటీ సీఎం తెలిపారు. సంపూర్ణ విజయం కోసం శ్రమించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





