– తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసు
చెన్నై, ఏప్రిల్ 6: లాకప్ డెత్ కేసులో మధురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాధ్యులైన 9మంది పోలీసుకలు ఉరిశిక్ష విధిస్తూ తీర్పుని ఇచ్చింది. తమిళనాడులోని తూతుకుడి జిల్లా సాతాన్‌కుళంకు చెందిన తండ్రీ కుమారుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొమ్మిది మంది తమిళనాడు పోలీసులకు మరణశిక్ష విధించింది. 2020 జూన్ 19న లాక్‌డౌన్ సమయంలో అనుమతించిన సమయానికి మించి మొబైల్ షాప్ నడిపారన్న ఆరోపణలతో యజమాని జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్న వారిని తీవ్రంగా హింసించడంతో ఇద్దరూ చనిపోయారు. ఈ ఘటనకు పాల్పడిన తొమ్మిది మంది పోలీసులపై ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది. కొవిడ్ కారణంగా 2020లో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అదే ఏడాది జూన్ 19న లాక్‌డౌన్ సమయంలో అనుమతించిన దానికంటే ఎక్కువ సేపు మొబైల్ షాప్ తెరిచి ఉంచినందుకు స్థానిక వ్యాపారి జయరాజ్, అతడి కుమారుడు బెనిక్స్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరినీ సత్తాన్‌కులం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. జూన్ 23న కొన్ని గంటల వ్యవధిలో ఇద్దరూ మరణించారు. పోలీసులు రాత్రంతా వారిని తీవ్రంగా కొట్టి హింసించడం వల్లే వారు చనిపోయారని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో ఆ సమయంలో డ్యూటీలో పోలీసులను సీబీఐ అధికారులు అరెస్టు చేసి, దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో తండ్రీ కుమారులపై పోలీసులు మోపిన అభియోగాలు కూడా అబద్ధమని తేలింది. ఈ కేసులో ఒక మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. తండ్రీకొడుకులపై రాత్రంతా దాడి జరిగిందని.. స్టేషన్‌లోని బల్లలు, లాఠీలపై రక్తపు మరకలు ఉన్నాయని ఆమె వెల్లడించింది. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు సీసీటీవీ రికార్డింగ్‌లు ప్రతిరోజూ ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా పోలీసులు సెట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. పోలీసులు పెట్టిన హింస వల్లే తండ్రీకుమారులు మరణించినట్లు ధ్రువీకరించారు. నాటి నుంచి ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.
————–


