రబీలో 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

– 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి
– 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం
– అందుబాటులో 16 కోట్లకు పైచిలుకు గన్నీ బ్యాగులు
– అనధికార మార్గాల్లో ధాన్యాన్ని తరలిస్తే ఉపేక్షించేది లేదు
– సరిహద్దుల్లో ఎగుమతులు, దిగుమతులపై నిఘా
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: రబీ సీజన్‌లో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అందులో ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సన్నద్ధంగా ఉందని చెప్పారు. ముందెన్నడూ లేని రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక సీజన్‌తో మరో సీజన్ పోటీపడి ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నదన్నారు. హుజూర్‌నగర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఖరీఫ్‌లో రాష్ట్రంలో దిగుబడి అయిన మొత్తం యావత్ దేశంలోనే సరికొత్త రికార్డు నమోదు చేసుకున్నదన్నారు. అదే సమయంలో 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే కాదు కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో చెల్లింపులు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. రబీలో ధాన్యం కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు 16 కోట్లకు పైచిలుకు గన్నీ బ్యాగులను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యానికి మద్దతు ధర కల్పించామని, సన్నాలకు క్వింటా ఒక్కింటికి రూ.2,389 తోపాటు అదనంగా రూ.500 బోనస్, సాధారణ రకానికి రూ.2,369లు చెల్లించనున్నట్లు, ప్రతీ రైతుకు ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల లోపు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రబీ వరి ఉత్పత్తి 148 లక్షల మెట్రిక్ టన్నులను మించనున్న నేపథ్యంలో భారీ దిగుబడిని సమర్థవంతంగా నిర్వహించి రైతులు నష్టపోకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,251 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, వీటికి ఆధునిక మౌలిక వసతులు, తగిన నిల్వ సదుపాయాలు, సక్రమ రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రాన్ని ఒక అధికారి పర్యవేక్షణలో ఉంచి రోజువారీ కొనుగోలు, నాణ్యత తనిఖీలు, సమయానికి చెల్లింపులు, పారదర్శకతను నిర్ధారించనున్నట్లు చెప్పారు. వరి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రవాణాలో ఎలాంటి అవరోధాలు ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా కోత పూర్తయిన వరిని సులభంగా కేంద్రాలకు చేరవేయాలని సూచించారు. అనధికార మార్గాల్లో ధాన్యం మళ్లింపును నివారించేందుకు కఠిన పర్యవేక్షణ చర్యలు అమలులో ఉన్నాయన్నారు.

కస్టమ్ మిల్డ్ రైస్ పథకంలో  సమస్యలు 

పార్ బాయిల్డ్ (ఉడికించిన) బియ్యం కొనుగోలుకు సంబంధించి కస్టమ్ మిల్డ్ రైస్ పథకంలో ఎదురవుతున్న సమస్యలపై కూడా మంత్రి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఉడికించిన బియ్యం కోటాను తగ్గించగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సరఫరా చేసే బియ్యంలో బ్రోకెన్ రైస్ శాతం విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయడం వల్ల రైస్ మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నాణ్యత ప్రమాణాలను పాటించడం కష్టంగా మారిందని మిల్లర్లు తెలియజేశారన్నారు. ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, మిల్లర్లు, కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు, మిల్లర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వరి కొనుగోలు పురోగతిని సమీక్షించేందుకు త్వరలో ముఖ్యమంత్రిస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. గత ఖరీఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసి చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. స్వతంత్ర దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకే సీజన్‌లో ఇంత భారీ స్థాయిలో కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఆ ఖరీఫ్లో రైతుల ఖాతాల్లో రూ.19,500 కోట్లకు పైగా సొమ్ము నేరుగా జమ చేసినట్లు తెలిపారు.

కొనుగోలు వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నాం

రాబోయే రబీ సీజన్‌లో మరో రికార్డు సాధించే దిశగా కొనుగోలు వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నామని మంత్రి చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని తెలంగాణ కొనుగోలు కేంద్రాలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. మొత్తం పంట కాలంలో రాష్ట్రానికి కేటాయించిన నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించి పంటలకు సాగునీటి సరఫరా అందించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణకు చెందిన నదీ జలాల హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అన్ని వేదికలపై రాష్ట్ర హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తున్నామని పునరుద్ఘాటించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, సివిల్ సప్లై అధికారులు, మార్కెట్ చైర్మన్ రాధికా అరుణ్ కుమార్ దేశముఖ్, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లికార్జున్, స్థానిక ఆర్‌డిఓ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, హుజూర్‌నగర్ రామస్వామి గుట్ట వద్ద అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్‌ను మంత్రి పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *