~సిగాచిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
– ఇప్పటివరకు 42మంది మృతి
– రేపు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందం రాక
పటాన్ చెరువు , ప్రజాతంత్ర, జూలై 7: పాశమైలారం సిగాచి పరిశ్రమలో పేలుడు దుర్ఘటన జరిగి ఎనిమిది రోజులు దాటినా ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 42 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభించాల్సి ఉంది. ఐలా భవన్ వద్ద ఎనిమిది మంది కార్మికుల కుటుంబాలు పడిగాపులు కాస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో 18 మంది వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో 143 మంది ఉండగా 61 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. మొత్తం 14 మంది కార్మికులు హాస్పిటల్‌లో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికే 70కి పైగా మానవ అవశేషాలను డీఎన్‌ఏ రిపోర్టు కోసం అధికారులు ల్యాబ్‌కు పంపించారు. కాగా సిగాచి పరిశ్రమను సందర్శించిన హైలెవల్ కమిటీ ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది. ఈ కమిటీ సభ్యులు గత శుక్రవారం ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయం, కార్మికులు ఎంత మంది ఉన్నారు, పేలుడు జరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. అలాగే పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై కంపెనీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చివరకు సేప్టీ రూల్స్ పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన కమిటీ సభ్యులు ఆ మేరకు ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో ఆచూకీ లభించని కార్మికులు ఏమయ్యారో తెలియని పరిస్థితి. రెస్క్యూ బృందాలు కర్మాగారంలో భవనాల శిథిలాల తొలగింపు వేగవంతం చేసినా ఫలితం దక్కడం లేదు. దీంతో తమ వారి కోసం కార్మికుల కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రమాదం జరిగి 8 రోజులవుతున్నా రాహుల్, రవి, వెంకటేశ్, ఇర్ఫాన్, విజయ్, అఖిలేశ్, జస్టిన్, శివాజీల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఐలా సెంటర్ వద్ద తమ వారి కోసం కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపైనా దక్కుతుందేమోనని ఆశతో వారు రోజు ఇక్కడికి వస్తున్నారు. గల్లంతైన ఎనిమిది మంది విషయంలో డీఎన్‌ఏ రిపోర్టులు కీలకంగా మారనున్నాయి. 70కి పైగా నమూనాలను డీఎన్‌ఏ రిపోర్టుల కోసం అధికారులు పంపారు. మరోవైపు మంగళవారం పాశమైలారం సిగాచీ పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బృందం రానుంది. ఘటనా స్థలాన్ని ఆ బృందం పరిశీలించనుంది. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఎస్‌డీఎంఏతో కలిసి అధ్యయనం చేయనుంది. ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు చేయనుంది.




