– 8మంది ఇంజనీర్ల సస్పెన్షన్
– ప్రభుత్వ సంచలన నిర్ణయం
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి 19: దక్షిణ మండల విద్యుత్ సంస్థలో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఎనిమిదిమంది ఇంజినీర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్యలు తీసుకుంది. ఈ ఘటన విద్యుత్ శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రజలకు సేవలందించే కీలక విభాగంలో అవినీతి చోటుచేసుకోవడం ఆందోళనకరంగా మారింది. విద్యుత్ శాఖలో అవినీతి జరుగుతోందన్న ఆరోపణలపై కొంతకాలంగా 150కు పైగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా అధికారులు పలు ఆధారాలను సేకరించారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలను పరిశీలించి సంబంధిత ఇంజినీర్ల పాత్రను గుర్తించారు. అవినీతి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. విజిలెన్స్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంజినీర్లు ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా లంచాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. సేవలు అందించేందుకు, ఫైళ్లను త్వరగా పరిష్కరించేందుకు, కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు ఎనిమిదిమంది అధికారులు లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. డిజిటల్ చెల్లింపుల లావాదేవీలను అధికారులు సాంకేతికంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. సస్పెండైన వారిలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, సబ్ ఇంజినీర్లు ఉన్నారు. వారిపై శాఖాపరమైన విచారణ కూడా చేపట్టే అవకాశం ఉంది. అవినీతి విషయంలో సర్కార్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని సహించమని స్పష్టం చేసింది. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కేసులో మరికొందరి పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. విచారణ కొనసాగుతున్న క్రమంలో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విద్యుత్ శాఖలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అవినీతి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు.
—————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





