– రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ హర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో బీసీలు 61% పైగా గెలవటం పట్ల తెలంగాణ బీసీ కమిషన్ చైౖర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్క్ష్మి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో కూడా బీసీ అభ్యర్థులు 52.75% గెలిచారని గుర్తు చేశారు. మున్సిపల్ వార్డులలో బీసీలకు 28.22%, మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లలో 35.25% బీసీలకు కేటాయించినా జనరల్ స్థానాలలో కూడా కలిపి మొత్తంమీద 61% గెలవటం బీసీ వర్గాలలో పెరిగిన చైతన్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్‌ఎంసీ, కార్పొరేషన్ల ఎన్నికల్లో కూడా బీసీలు అత్యధికంగా గెలుస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన సమగ్ర సర్వేలో బీసీల సంఖ్య 56.33% అని తేలగా రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా అది ఇంకా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని, ఈలోపు కొందరు కోర్టుకెళ్లి రిజర్వేషన్ అమలు కాకుండా చేయడం సముచితం కాదని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో, ఇప్పటి పురపాలక ఎన్నికల్లో బీసీలు గెలిచిన స్థానాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు అమలు చేయడానికి అనుమతివ్వాలని, 9వ షెడ్యూల్‌లో పెట్టాలని, కోర్టుల్లో కేసులు వేసిన వారు కూడా కేసులు ఉపసంహరించుకుని చట్టబద్ధంగా బీసీల రిజర్వేషన్లు సాకారమయ్యే మార్గం సుగమం చేయాలని బీసీ కమిషన్ కోరుకుంటున్నదని చైర్మన్ నిరంజన్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





