‘లైఫ్‌ సైన్సెస్‌’లో 60వేల మందికి ఉపాధి

– 2024-25లో రూ.66వేల కోట్ల ఉత్పత్తుల ఎగుమతి
– రూ.లక్ష కోట్ల పెట్టుబడితో దీర్ఘకాలిక వ్యూహం
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 11 : తెలంగాణను గ్లోబల్‌ లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నామని, ఆ క్రమంలోనే కేవలం ఏడాదిన్నరలో రూ.50వేల కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించగలిగామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఫలితంగా కొత్తగా 60వేల మందికి ఉపాధి లభించిందన్నారు. హైటెక్‌ సిటీ ట్రైడెంట్‌ హోటల్‌లో ఈటీ ఫార్మాటెక్‌ ఇన్నోవేటివ్‌ కాంక్లేవ్‌ రెండో ఎడిషన్‌ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. 2024-25లో రూ.66వేల కోట్ల విలువైన లైఫ్‌ సైన్సెస్‌ ఉత్పత్తులను తెలంగాణ ఎగుమతి చేసిందని, ప్రపంచానికి కావాల్సిన మూడిరట ఒక వంతు వ్యాక్సిన్లను అందిస్తూ హైదరాబాద్‌ వ్యాక్సిన్‌ రాజధానిగా ప్రసిద్ధి చెందిందని వెల్లడిరచారు. దేశంలో అతిపెద్ద మెడికల్‌ డివైసెస్‌ పార్క్‌ నుంచి మేడ్‌ ఇన్‌ తెలంగాణ స్టెంట్లు, కేథెటర్లు యూఎస్‌, జపాన్‌ సహా 89 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని ఈ సందర్భంగా వివరించారు. లైఫ్‌ సైన్సెస్‌లో గ్రామీణ, సెమీ-అర్బన్‌ ప్రాంతాల్లో ఐదు లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని, ఇందుకు రూ.లక్ష కోట్లతో దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహాన్ని అమలు చేయబోతున్నామని, అందరి అభిప్రాయాలను సేకరించి వికారాబాద్‌, నల్గొండ, మెదక్‌లో ఫార్మా విలేజెస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ రంగానికి అవసరమైన అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులను అందించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని, ఇక్కడ స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను జీవ శాస్త్ర దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అందించబోతున్నామని శ్రీధర్‌బాబు వివరించారు. ఇప్పటికే యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ద్వారా డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో వంటి సంస్థలతో కలిసి తెలంగాణ యువతకు శిక్షణ ఇస్తున్నామని, సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌(సీ4ఐఆర్‌) భాగస్వామ్యంతో సైన్స్‌ గ్రాడ్యుయేట్లకు లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో నిపుణులను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రత్యేకంగా తెలంగాణ కాంప్రెహెన్సివ్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీకి శ్రీకారం చుట్టామని, ఇది చివరి దశలో ఉందని, ఈ రంగాన్ని కేవలం పరిశ్రమలు లేదా ఆర్‌ అండ్‌ డీ సెంటర్లకే మేం పరిమితం చేయక టెక్నాలజీ మేళవింపుతో ప్రజలకు ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లను ముందే గుర్తించేందుకు ఏఐ ఆధారిత స్క్రీనింగ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించామని మంత్రి చెప్పారు. సత్ఫలితాలు రావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో పలు దిగ్గజ ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *