– ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
మేడ్చల్, ప్రజాతంత్ర, ఆగస్టు 5: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ మండలంలోని అత్వెల్లిలో గల కన్వెన్షన్ హాల్‌లో శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మను చౌదరిలతో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతిష్ట్మాకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ శుభ సూచకమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డులు ఇస్తున్నామన్నారు. ఇది నిరంతం ప్రక్రియ అని అన్నారు. ప్రస్తుతం పేదలు కూడా సన్న బియ్యం నినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ కార్డులపై ఒక్కొక్కరికి సుమారు 6 కేజీల చొప్పన సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డులు రాని వారు నేరుగా మీ-సేవా కేంద్రంలో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లాలో సుమారు 40,082 వేల కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నామని, పాత రేషన్ కార్డులలో కొత్తగా సభ్యులను చేర్చడం వంటి మార్పులతో దాదాపు 82వేల రేషన్ కార్డులను మొత్తం లక్షా 22 వేల కార్డులు పంపిణీ జరిగాయని మంత్రి పేర్కొన్నారు. రేషన్ కార్డుతోపాటు ఆరోగ్యశ్రీ కార్డు కూడా అమలు అవుతుందని తెలిపారు. ఎన్నికలపుడు తమ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మహానగరం అయినందున ఇక్కడి జనాభాకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా గోదావరి జలాలను హైదరాబాద్ తరలించేందుకు ముఖ్యమంత్రి పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నారని తెలిపారు. డ్రైనేజీతోపాటు అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల ఆర్ధిక స్వాలంబనకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, రైతులకు రైతు భరోసా, రుణ మాఫీ చేశామని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభివృద్దికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, వాటిని ఉపయోగించుకొని ఆర్ధికంగా బలోపేతం కావాలని కోరారు. మంత్రి శ్రీధర్‌బాబు, మహేందర్ రెడ్డి, కలెక్టర్ చేతుల మీదుగా లబ్దిదారులకు దాదాపు రూ.కోటి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ నర్సింహులు యాదవ్, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, కీసర ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, సివిల్ సప్లయిస్ అధికారి శ్రీనివాస రెడ్డి, శామీర్‌పేట్ తహాసీల్దార్ యాదగిరి రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.





