మహిళలకు 5వేల ఈవీ ఆటోలు

ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మంత్రి పొన్నం
మహిళా సంఘాలకు ఆర్టీసీ తరపున అద్దె చెల్లింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: తమ ప్రజాప్రభుత్వం మహిళా సాధికారత కోసం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని, వారం రోజుల్లో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిన టార్గెట్‌ నిండుతుందని, 6500 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం నమోదు కాబోతుంది రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రజాభవన్‌లో శనివారం జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొన్న మహిళలనుద్దేశించి ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో ఆర్టీసీ, మహిళా సంఘాల తరపున సంబరాలు చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు ఎందుకు బస్సు యజమానులు కావద్దని తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, అధికారులు కలిసి చర్చించి ఆర్టీసీ బస్సులకు మహిళా సంఘాలను యజమానులుగా చేశామన్నారు. ఇప్పటికి 150 బస్సులు మహిళా సంఘాల ద్వారా నడుస్తున్నాయని, కొత్త బస్సులు తీసుకొస్తున్నాం.. నియామకాలు చేపడుతున్నాం.. మహిళా డ్రైవర్లు కూడా వచ్చారు అని తెలిపారు. జంట నగరాల్లో ఐదు వేల ఈవీ ఆటోల అనుమతి మహిళలకే కేటాయిస్తామన్నారు. వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లో పొల్యూషన్‌ తగ్గించేందుకు ఇది మంచి కార్యక్రమం అని, రవాణా శాఖ ద్వారా ఈ కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ,ప్రయాణికుల భద్రత, ఆర్టీసీ పరిరక్షణతో ముందుకు పోతున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో మహిళా సంఘాల ద్వారా చర్చ జరగాలని సూచించారు. తన నియోజకవర్గంలో 270 మహిళా సంఘాలు ఉన్నాయి.. ప్రతి గ్రామంలో స్టీల్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తున్నాం.. అందులో అన్ని రకాల వస్తువులు ఉంటాయి.. త్వరలోనే పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని పొన్నం చెప్పారు. ఈ సందర్భంగా ఆర్టీసీలో 151 మండల మహిళా సంఘాల గ్రూపులకు (అద్దె బస్సుల యజమానులకు) రూ.1.05 కోట్ల చెక్కును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్కలు కలిసి అందజేశారు. మహిళా రచయితలు, కవులు రాసిన మహాలక్ష్మి (మహిళా సాధికారతలో ప్రగతి చక్రాలు) పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకంలోని కవిత మంత్రి పొన్నం ప్రభాకర్‌ చదివి వినిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *