– అయోధ్య కోసం ఎందరో త్యాగాలు, బలిదానాలు
– వారి ఆత్మలకు నేటితో శాంతి చేకూరుతుంది
– ధ్వజారోహణ్ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
అయోధ్య, నవంబర్ 25: అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి ఆత్మలు ఈరోజు సంతోషంగా ఉంటాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అయోధ్యలో బాలరాముడి ఆలయ శిఖరంపై ప్రధానమంత్రి మోదీతో కలిసి కాషాయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మహంత్ రాజచంద్ర దాస్ మహరాజ్, దాల్మియా, అశోక్ సింఘాల్ సహా అనేక మంది సాధువులు, విద్యార్థులు, అన్నిరంగాలకు చెందిన ప్రజలు ప్రాణత్యాగాలు చేశారు.. ఆలయ నిర్మాణం కోసం వారు కన్న కలలు నేటికి ఫలించాయి అని అన్నారు. ఈరోజుతో ఆలయ శాస్త్రీయ పక్రియ పూర్తయిందని, ధ్వజారోహణ నిర్వహించుకున్నామని పేర్కొన్నారు. రామాలయ నిర్మాణం కోసం 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కాషాయ జెండా, భగవధ్వజం, ధర్మధ్వజం ఈరోజు ఆలయ శిఖరంపై ఆవిష్కృతమైందని ఆయన అన్నారు. హిందువులు తమ సత్వగుణాన్ని 500 ఏళ్లుగా చాటుకుంటూ వచ్చారని, ఎట్టకేలకు రామ్‌లల్లా మందిర నిర్మాణం జరిగి బాల రాముడు మన కళ్లముందు ఉన్నారని అన్నారు. సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక అని పేర్కొన్నారు. మన పూర్వీకులు మనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇదని అన్నారు. ఈ దేశంలో పుట్టిన వారంతా మన పెద్ద సోదరులని, ఎన్నో అంచనాలతో ప్రపంచం మనవైపు చూస్తోందని, వాటిని సాకారం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ నిర్మాణం కోసం ఎంతోమంది ఆశతో ఎదురు చూశారని.. వారి సంకల్పం నేటితో నెరవేరిందని చెప్పుకొచ్చారు. ప్రపంచానికి శాంతి, శ్రేయస్సును వ్యాపింపజేసిన రామరాజ్య ’ధ్వజం’ ఇప్పుడు శిఖరంపై కూర్చుందని తెలిపారు. ధ్వజం అనేది ఒక చిహ్నం అని చెప్పారు. ధ్వజారోహణ కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ, మోహన్ భాగవత్ ప్రత్యేక పూజలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ హాజరయ్యారు.
అంగరంగ వైభవంగా 22 అడుగుల కాషాయ జెండా ఆవిష్కరణ
అయోధ్యలో కాషాయ ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రామ మందిర నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయ శిఖరంపై 22 అడుగుల కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆలయ పనులు పూర్తయ్యాయనడానికి గుర్తుగా ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అయోధ్య శ్రీరామ్‌లల్లా ప్రధాన ఆలయంలో ధ్వజారోహణం జరిగింది. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. సాధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ జెండా లంబకోణ త్రిభుజాకారంలో సూర్యుని చిహ్నాన్ని కలిగి ఉంది. శాశ్వత శక్తి, దైవిక తేజస్సు, ధర్మం, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. శ్రీరాముడితో సంబంధం ఉన్న అన్ని లక్షణాలు ఈ జెండాలో కనిపిస్తాయి. ‘ఓం చిహ్నంతో చెక్కబడిన జెండాను ఆలయ ‘శిఖర్’ పైన ఉంచారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





