*మేడారంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్*
*జాతర ప్రాంతాల్లో 30 ప్రాంతాల్లో ప్రత్యేకంగా 800 డాక్టర్లతో మెడికల్ క్యాంపులు*
*జంపన్న వాగులో సురక్షిత స్నానాలకు 325 మంది స్విమ్మర్లు, రక్షణ సిబ్బంది
మేడారం జాతరకు వచ్చే లక్షలాది భక్తుల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టింది. ఒకవైపు సురక్షిత మంచినీటిని అందించడం, ముమ్మర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం, జంపన్న వాగులో నీరు కలుషితం కాకుండా చర్యలుచేపట్టడంతో పాటు పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలను కల్పించింది.
మేడారం జాతర ప్రధాన వేదిక సమీపంలో టిటిడి కల్యాణ మండపంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం, 30 ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. మోత్తం జాతరలో ఏవిధమైన ఇబ్బందులు కలుగకండా ఉండేందుకు 5192 మంది మెడికల్, పారా మెడికల్ సిబ్బందిని వైద్యఆరోగ్యశాఖ రంగంలోకి దించింది. జాతర సమయంలో 24 గంటలు వైద్య సేవలందించేందుకు గాను 649 వైద్యాధికారులు, 154 మంది ఆయుష్ వైద్యాధికారులు, 673 నర్సింగ్ అధికారులు, 1905 ఆశ వర్కర్లు, 1111 పారామెడికల్ సిబ్బంది, 331 సూపర్వైజరి స్టాఫ్, 700 ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.
జాతర ముగిసిన అనంతరం కూడా స్థానిక గిరిజనులకు ఏవిధమైన ఆరోగ్య సమస్యలు కలుగకుండా 10 మెడికల్ క్యాంప్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు, మేడారం చుట్టూ పక్కలా ఉన్న ఏటూరు నాగారం, ములుగు, పస్రా, గోవిందా రావు పేట, మంగపేట సి.ఎస్.సి. ఆసుపత్రులను పటిష్ఠపరిచారు.
*జంపన్న వాగులో సురక్షిత స్నానాలకు 325 మంది స్మిమ్మర్లు, రక్షణ సిబ్బంది*
మేడారం వచ్చే భక్తులు విధిగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ జంపన్న వాగులో ప్రమాద వశాత్తూ పడి ప్రమాదాలకు గురు కాకుండా ఉండేందుకు జంపన్న వాగు పొడుగునా సురక్షితులైన స్విమ్మర్లు, సింగరేణి, ఎస్.డి.ఆర్.ఎఫ్ సిబ్బందిని మొత్తం 325 మందిని నియమించారు. వీరిలో మత్శ్య శాఖ ద్వారా 210 స్విమ్మర్లు, 12 మంది సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులు, 100 మంది ఎస్.డీ.ఆర్.ఎఫ్ టీమ్ సభ్యులున్నారు.వీరందరికీ లైఫ్ జాకెట్లు, ప్రత్యేక టీ షర్ట్స్, సెర్చ్ లైట్స్, లైఫ్ సేవింగ్ పరికరాలు అందచేశారు.
*అగ్ని ప్రమాదాలు జరగకుండా 268 సిబ్బంది*
జాతర మొత్తం ప్రాంగణంలో ఏవిధమైన అగ్నిప్రమాదాలు జరుగకుండా రాష్ట్ర అగ్నిమాపక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. 15 ఫైర్ బ్రిగేడ్స్, 12 మిస్ట్ బుల్లెట్స్, రెండు ఫైర్ ఇంజన్లను జాతర ప్రాంగణంలో మోహరించారు. మొత్తం 268 ఫైర్ సిబ్బంది విధుల్లో ఉంటారు.





