రూ.219 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం

– దావోస్ పర్యటనల్లో44 ఎంవోయూలు చేసుకున్నాం
– కొత్తగా 68,150 మందికి ప్రత్యక్ష ఉపాధి
– శ్వేతపత్రం విడుదలకూ సిద్ధం
– శాసనసభలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: గత రెండు దఫాల (2024, 2025) దావోస్ పర్యటనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 44 ఎంవోయూలను వివిధ కంపెనీలతో కుదుర్చుకుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. శాసనసభలో సభ్యులు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, పాయల్ శంకర్, ధన్‌పాల్ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ పెట్టుబడుల గ్రౌండింగ్ వివిధ దశల్లో ఉందని, ఫలితంగా కొత్తగా 68,150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని వెల్లడించారు. 2024 పర్యటనలో 18 ఎంవోయూలు కుదుర్చుకోగా రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 2025 పర్యటనలో 26 ఎంవోయూలు కుదుర్చుకోగా రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. రూ.81,800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్న 6 కంపెనీలకు భూముల కేటాయించామని, భూముల కేటాయింపుతో ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. మరో 3 కంపెనీలకు రూ.30 వేల కోట్ల పెట్టుబడుల కోసం భూములు గుర్తించామన్నారు. నిజామాబాద్ ఐటీ టవర్‌లో 11 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, 681 సీట్ల సామర్థ్యంతో ఐటీ టవర్ నిర్మించినట్లు చెప్పారు. ప్రస్తుతం 276 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. పెట్టుబడులపై విపక్షాలు చేస్తున్న విష ప్రచారం సరికాదని, స్వార్థ రాజకీయాల కోసం తమపై కోపంతో చేసే ఈ తప్పుడు ప్రచారం రాష్ట్రానికి మంచిది కాదని హితవు పలికారు. తాను పర్యవేక్షించే పోర్ట్‌ఫోలియోస్‌లో పారదర్శకతకు కట్టుబడి ఉన్నా.. ఈరోజే కాదు.. రాబోయే రోజుల్లోనూ ఇదే మాటపై కట్టుబడి ఉంటా. అందుకు అనుగుణంగానే నడుచుకుంటానని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఎంవోయూలు, పెట్టుబడులు, కంపెనీలు తదితర అంశాలపై శ్వేతపత్రం విడుదలకు కూడా సిద్ధమన్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకొచ్చేందుకు వరల్డ్ ఎకానమిక్ ఫోరం వార్షిక సదస్సు ఒక గొప్ప ప్లాట్ ఫాం అని చెప్పారు. ఐసోలేషన్‌లో ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావు.. డిఫరెంట్ ప్లాట్‌ఫాంలపై పరిశ్రమల ఏర్పాటుకు మన దగ్గర ఉన్న అనుకూలతలు, అవకాశాలు, ప్రభుత్వం తరఫున అందించే ప్రోత్సాహకాలపై అవగాహన కల్పిస్తేనే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారని అన్నారు. ప్రతి ఎంవోయూ గ్రౌండింగ్ కావడానికి సమయం పడుతుంది.. ఆ విషయంపై అవగాహన లేని కొందరూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దావోస్ పర్యటనలు, ఇతర సందర్భాల్లో చేసుకున్న ప్రతి ఎంవోయూను గ్రౌండింగ్ చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. టైర్-2, టైర్-3 పట్టణాలు, నగరాల్లో పారిశ్రామికాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. పదేళ్ల తర్వాత ఎంఎసఎంఈ పాలసీని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ఆధ్వర్యంలోని తమ ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీలో మన ‘టీ-ఫైబర’ను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఓ రోల్ మోడల్‌గా నిలిపామని, ఇది తాము చెప్పింది కాదు.. సాక్షాత్తూ కేంద్రమే చెప్పిందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు, ప్రభుత్వ కార్యాలయాలకు ‘టీ-ఫైబర’ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *