పంచాయతీలకు మూడో విడత కేంద్ర నిధుల విడుదల

– తెలంగాణకు రూ.387.53 కోట్లు
– ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో రూ.2000 కోట్లు
– మిగతావి త్వరగా విడుదల చేయాలి: మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తవడంతో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన పెండింగ్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది. ఈ క్రమంలో మూడో విడతగా రాష్ట్రానికి రూ. 387.53 కోట్లను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం రూ. 1034.42 కోట్ల నిధులు అందాయి. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగేందుకు ఈ నిధులు కీలకంగా ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, అంతర్గత రహదారుల మరమ్మతులు వంటి పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. అయితే, ఇంకా సుమారు రూ.2000 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిధుల ఆలస్యం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రభావితమవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగాలంటే నిధుల సమయానుకూల విడుదల అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు విడుదలైన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని, ముఖ్యంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని, ప్రాధాన్యత కలిగిన మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, పారదర్శకతతో నిధుల వినియోగం, ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి సీతక్క పునరుద్ఘాటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *