– 3 కోట్ల మంది హాజరయ్యే అవకాశం
– రూ.250 కోట్లకుపైగా నిధులతో పనులు
– భక్తులు ఇబ్బంది పడకుండా సూచికలు ఏర్పాటు చేయాలి
– సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ
– మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క
– ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్‌లు వాడాలి: సీఎస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13 : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు ఈసారి దాదాపు మూడు కోట్లమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వంలోని వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రులు అడ్లూరి లక్మ్షణ్ కుమార్, దనసరి అనసూయలు సూచించారు. ఈనెల 28 నుండి 31వ తేదీ వరకు జరిగే జాతరపై సచివాలయంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ 2024 మేడారం జాతరకు కోటిన్నరమంది హాజరుకాగా ఈసారి గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.150 కోట్లతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నందున దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. జాతరను కుంభమేళాకు మించి అద్భుతంగా నిర్వహించి ప్రభుత్వానికి జాతీయస్థాయిలో మంచి పేరు తీసుకురావాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మహా జాతరను విజయవంతంగా నిర్వహించడాన్ని ప్రతి అధికారీి ఒక బాధ్యతగా తీసుకోవాలని, చిన్న లోపం కూడా లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన సూచించారు. మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుధ్యం, వైద్య సేవలు వంటి అన్ని విభాగాల్లో సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జాతరకు వచ్చే భక్తులు సులభంగా గమ్యానికి చేరుకునేలా అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో స్పష్టమైన దిశా సూచిక బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ పటిష్టంగా ఉండాలని, ప్రత్యేక రూట్ మ్యాప్‌లతోపాటు అవసరమైనచోట వన్‌వే వ్యవస్థ అమలు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, అందుకనుగుణంగా వసతి, పార్కింగ్, రవాణా సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ విషయంలో వీఐపీలు, సామాన్య భక్తులు అనే తేడా లేకుండా సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు.
ఈసారి జాతరకు రూ.251 కోట్లు మంజూరు: సీతక్క
మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ఈసారి జాతర ఏర్పాట్లకు రూ.150 కోట్లతోపాటు గద్దెల పునరుద్ధరణ పనులకు రూ.101 కోట్లు మొత్తం రూ.251 కోట్లను ముఖ్యమంత్రి మంజూరు చేశారని వివరించారు. భక్తులకు సాఫీగా దర్శనం లభించేలా ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రస్థాయిలో వివిధ శాఖ కార్యదర్సులు, హెచ్‌వోడీలతో ప్రత్యేకంగా వాట్స్-అప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి జాతర నిర్వహణపై ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సీతక్క సూచించారు. శానిటేషన్, తాగునీరు, రవాణా, భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ప్రధానంగా టాయిలెట్‌లను మరింత పెంచాలని సూచించారు. గురు, శుక్రవారాల్లోనే ప్రతి రోజూ కనీసం 40 లక్షల మంది భక్తులు ఉంటారని, ఇందుకనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. వచ్చే వందేళ్లకు సరిపడ అభివృద్ధి కార్యక్రమాలకు మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున నిధులు మంజూరైనట్లు సీతక్క గుర్తు చేశారు.
ప్రత్యేక యాప్ రూపొందించాలి : సీఎస్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ జాతర ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అన్ని శాఖల ఉన్నతాధికారులు సకాలంలో పనులు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. భక్తులకు చేసిన ఏర్పాట్లు, రవాణా, ఇతర సౌకర్యాలు, భక్తులు పాటించాల్సిన సూచనలపై విస్తృత స్థాయిలో సమాచారాన్ని అందించాలన్నారు. మేడారానికి వచ్చే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్‌లు ఉపయోగించుకోవాలన్నారు. జాతర సమాచారాన్ని, నియమనిబంధనలను తెలియచేసే ప్రత్యేక యాప్/క్యూ.ఆర్ కోడ్ రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పార్కింగ్ ఏరియాలలో కూడా వాటర్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. శానిటేషన్, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. జాతర ఏర్పాట్లు, పురోగతి తదితర విషయాలను తెలియచేసే నివేదికను ప్రతీ రోజూ తమకు సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను కోరారు. వివిధ శాఖలు చేస్తున్న ఏర్పాట్లు, వాటి పురోగతి గురించి ములుగు కలెక్టర్ దివాకర పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. జిల్లా యంత్రాంగం రూపొందించిన ప్రత్యేక లోగో, యాప్, వీడియోలను మంత్రులు సీతక్క, లక్ష్మణ్ కుమార్, సీఎస్ రామకృష్ణారావులు ఆవిష్కరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సబ్యసాచి ఘోష్, అడిషనల్ డీజీలు విజయ్ కుమార్, స్వాతి లక్రా, వివిధ శాఖ కార్యదర్శులు, తదితర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




