పుస్తకాల పండుగ వచ్చేసింది

“2025 డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 28 వరకూ తెలంగాణ కళాభారతి స్టేడియంలో 38 వ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ జరుగనున్నది. ఈ సందర్భంగా వస్తున్న కొత్త పుస్తకాలు, పునర్ముద్రణలు, వాటి ప్రాధాన్యతల గురించి కొన్ని ప్రచురణ సంస్థలనుంచి సేకరించిన సమాచారం- ఈ వారం ప్రజాతంత్ర ‘శోభ’ పాఠకుల కోసం.”

ఈ పుస్తకాల పండగకి బీట్‌రూట్ బుక్స్ ద్వారా పబ్లిషింగ్ రంగంలో తొలి అడుగు వేస్తున్నా.  ఈ ఏడాది చుక్కాయపల్లి జయలక్ష్మమ్మ పద్యరూపంలో రాసిన రామాయణాన్ని ‘శ్రీ జయ రామాయణం’గా ప్రచురించి ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఆ తర్వాత వరుసగా తెలుగు అమ్మాయి ఉమా రాయపూరి  రాసిన ఇంగ్లీష్ నవల ‘Her 4am Love Story’,  సాయి వంశీ రాసిన ‘మైక్రో కథలు’, డా. కె. గీత కాలమ్స్ ‘అనగనగా అమెరికా’ పుస్తకాలను ఈ బుక్ ఫెయిర్‌కి తీసుకొస్తున్నాను. సోషల్ మీడియాలో తెలుగు పుస్తకాలకు కొత్తవైభవం వచ్చింది. ఈ క్రమంలోనే పాఠకులకు మంచిసాహిత్యం అందించాలనే ఉద్దేశ్యంతో బీట్‌రూట్ బుక్స్ మొదలుపెట్టాను. ఈ బుక్ ఫెయిర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అలాగే వచ్చే బుక్ ఫెయిర్‌కి మాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా కష్టపడతాను.

వి. మంజుల
బీట్ రూట్ ప్రచురణలు

బాలా పుస్తక ప్రచురణలు నుండి 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 35 పుస్తకాలు ప్రచురించాము. తమిళంలో సంచలనమైన చారిత్రక నవల ‘సుళుందీ’ తెలుగు అనువాదాన్ని ప్రచురించటం. తమిళం నుంచే, ప్రముఖ రచయిత బవా చెల్లదురై వ్యాసాల అనువాదం ‘పలుకుదారి పయనం’ తెలుగు అనువాదం ఈ బుక్‌ఫెయిర్‌లో ప్రత్యేక ఆకర్షణగా భావిస్తున్నాం. భగత్‌సింగ్‌ జైలుడైరీని కూడా తెలుగులోకి సులభమైన భాషలో, కొత్త పాఠకులకు కూడా నచ్చేలా తయారు చేశాం. క్లాసిక్ అని చెప్పుకోదగ్గ రవీంద్రనాథ్ ఠాగూర్ కథల అనువాదాన్ని రెండుభాగాలుగా తీసుకొచ్చాం. 5 నవలలు, దేశ–విదేశీ అనువాద కథా సంకలనాలు, హజెల్ లిన్, పెర్ల్ ఎస్. బక్, విక్టర్ హ్యూగో, ఇవాన్ తుర్గేనేవ్ క్లాసిక్స్ ఇలా 11 రీప్రింట్లు, తెలంగాణా, రాయలసీమ నేపథ్య రచనలు, కొడవటిగంటి కుటుంబరావు బాలసాహిత్యంతో కూడిన 7 పిల్లల పుస్తకాలు అందిస్తున్నాం. ఈ తరహా సాహిత్యం నిరంతం అందుబాటులో ఉండాలి. వచ్చేతరాలు వీటిని చదువుతూనే ఉండాలన్నది బాలాబుక్స్ ప్రధాన ఉదేశ్యం.

image.jpeg

ఎం. బి. ఉషా ప్రత్యూష

బాలా పుస్తక ప్రచురణలు

ఈమధ్యే నేను ‘ప్రేమలు పుస్తకాలు’ పేరుతో కొత్త పబ్లికేషన్స్ మొదలుపెట్టా. నేనిప్పటివరకూ రాసిన ‘ఇరానీ కేఫ్’, ‘కాగితం పడవలు’, ‘నల్లగొండ కథలు’, ‘నానిగాడు’– పుస్తకాలన్నింటినీ ఈ నెలలోనే రీప్రింట్ చేశా. ఇప్పటికైతే ఇండిపెండెంట్‌గా నా పుస్తకాలను నేనే ప్రచురించుకోవాలన్న ఆలోచనతో ఉన్నా. గత నాలుగేళ్ళుగా ఎంతో ఇష్టంగా రాసుకుంటూ వచ్చిన ‘ఒక ఎండాకాలపు మధ్యాహ్నం’ అనే నవలను ఈ బుక్‌ఫెయిర్‌కే తీసుకొస్తున్నా. కథగా ఇదొక అమ్మాయీ అబ్బాయీ మధ్యన జరిగే ప్రేమకథే అయినా నేను ఈ కథకు ఎంచుకున్న శిల్పం వల్ల, చెప్పాలనుకున్న ఆలోచనలో ఉన్న కాంప్లెక్సిటీ వల్ల రాయడానికి ఇంత కాలం పట్టింది. రాయడానికి అనే కంటే కూడా, నేను ఈ కథను అర్థం చేసుకోవడానికే చాలాకాలం పట్టింది. ఇప్పుడీ కథ పుస్తకంగా నా నుంచి దూరమవ్వడమూ ఒక బాధే. ఒక ఎండాకాలపు మధ్యాహ్నం నవల ప్రాధాన్యత ఏంటి అనడిగితే ఎలా చెప్పాలో తెలియట్లేదు గానీ, ఇది చదివిన తర్వాత వచ్చే ఇంటర్‌ప్రిటేషన్స్ మంచి చర్చకు అవకాశమిస్తాయనుకుంటాను.

image.jpeg

వి. మల్లికార్జున్

ప్రేమలు ప్రచురణలు

ఝాన్సీ పబ్లికేషన్స్ నుండీ 2025 జనవరి నుంచి ఇప్పటివరకు 11 పుస్తకాలు తీసుకొచ్చాము. పాలగిరి విశ్వప్రసాద్ ‘నల్లరేగడి నేలల్లో’ కథాసంపుటితో మొదలై ప్రేమ, కుటుంబ బాంధవ్యాలు, సామాజిక విలువలతో కూడిన నవలలు, కథా సంకలనాలు, సంపుటులు, ఫిలాసాఫీ, సినిమా వ్యాసాలు ప్రచురించాము. మహాభారత ఇతిహాసం ఆధారంగా చేసుకుని ఆదిమ జాతుల ప్రేమ, తిరుగుబాటు నేపథ్యంగా నరేష్కుమార్ సూఫీ రచించిన ‘హిడింబి’ నవల, వివేక్ లంకమల రాసిన ‘పొట్టేలు’ నవల, జి. వెంకటకృష్ణ ‘నీల మెరుపు’ కథాసంపుటి 2025 హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నాం. ఎర్రమల్లెలు, ఆరేళ్ల ప్రేమ, సొంత ఊరు కథలు, సినిమా అన్వేషి, నాన్న వచ్చిన వేళావిశేషం, ఇకిగాయ్,  జిందగీ కథలు, కుటుంబీకుల కొండాటకం పిట్టకథ, బొమ్మ బొరుసు వంటి నవలలు, కథలు పాఠకులను మెప్పించే విధంగా ఉండబోతున్నాయని భావిస్తున్నాం.

image.jpeg

శ్రీ దివ్య

ఝాన్సీ పబ్లికేషన్స్

ఈ బుక్ ఫెయిర్ కి దాదాపు ముప్ఫై కొత్తపుస్తకాలు పాతిక రీ ప్రింట్స్ తీసుకొస్తున్నాం. ఎప్పట్నుంచో అందుబాటులో లేని ఊబిలో దున్న, అసలు ఎవరికీ తెలియని ఒక అద్భుతమైన నవల ‘అంతుపట్టని మనిషి’, శ్రీపతి కథల సంకలనం ‘సత్యజిత్ రాయ్ ఎవరు?’, కాలువ మల్లయ్య నవల ‘నీ బాంచెన్ గులాపోన్ని’ పుస్తకాలను మళ్ళీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. పందొమ్మిదేళ్లకే అద్భుతమైన కథలు రాసి రావిశాస్త్రి చేత మెప్పుపొంది కనబడకుండా పోయిన శ్రీరంగం రాజేశ్వరరావు కథల పుస్తకం ‘ఎర్రచీర’, ఎన్నో అవార్డులు పొందిన మ్యూజిక్ రూమ్ ఇంగ్లీష్ పుస్తకం తెలుగు అనువాదం, అందరూ సులభంగా AI నేర్చుకోవడానికి 30 రోజుల్లో AI నేర్చుకోండి అనే పుస్తకం, ఖదీర్ బాబు కొత్త కథ సంకలనం ‘దాహగీతి’, మూలా సుబ్రహ్మణ్యం కవితలు ‘దోసిట్లో నక్షత్రాలు’, ఉగాది నవలలపోటీలో గెలుపొందిన ‘ప్రేమలు’, ‘అనుకోకుండా’ – ఇలా ఇంకా చాలా పుస్తకాలు వస్తున్నాయి.

image.jpeg

వెంకట్ సిధారెడ్డి

అన్వీక్షికి ప్రచురణలు

ఈ సంవత్సరం మా ‘రేగి అచ్చులు’ సంస్థ తరఫున మూడు పుస్తకాలు వచ్చాయి. ఒకటి విశ్వరూప్ వేముల రాసిన ‘సోపతిగాళ్లు’ కథాసంపుటి కాగా, మరొకటి సందీప్ ఎస్‌కె రాసిన ‘అలా నిన్ను చేరా’ నవల. ఇవి రెండూ ఇప్పటికే పాఠకుల విశేష ఆదరణ పొందాయి. ‘అలా నిన్ను చేరా’ నవల రెండు నెలల్లోనే మొదటి ఎడిషన్ పూర్తి చేసుకొని, రెండో ఎడిషన్ సైతం అందుబాటులోకి వచ్చింది. బుక్ ఫెయిర్ సమయానికి ‘దిగులు కొంగ’ అనే తమిళ హైకూల తెలుగు అనువాద పుస్తకం తీసుకొస్తున్నాం. దీన్ని గిడ్డకింద మాణిక్యం తెలుగులోకి అనువదించారు. మా సంస్థలో ప్రచురిస్తున్న తొలి అనువాద పుస్తకం, తొలి కవిత్వ పుస్తకం ఇదే కావడం విశేషం. ఇందులోని ప్రతి హైకూ హృదయానికి చేరువవుతుంది.

image.jpeg

వి. సాయివంశీ, గూండ్ల వెంకటనారాయణ

రేగి అచ్చులు ప్రచురణలు

బీదరికపు అంచుని తాకే దళితుల బాల్యాన్ని గుర్తుచేసే మోహన్ తలారి ‘లైఫ్ @ బుట్టాయగూడెం’ (Rs.150/-), రాజ్య యంత్రాంగ హింసా ప్రవృత్తి వల్ల ఏర్పడిన సామాజిక సంక్షోభాలని రికార్డ్ చేసిన బాలగోపాల్ ‘కల్లోల కథాచిత్రాలు’ (Rs.230/-), మిస్టిఫై చేయబడ్డ మాతృత్వపు మరోకోణాన్ని, సిస్టర్ హుడ్ అవసరాన్ని చెప్పిన ఉమా నూతక్కి, సుజాత వేల్పూరిల నవల ‘రెక్కచాటు ఆకాశం’ (Rs.300/-), అక్రమ మైనింగ్ వల్ల ఏర్పడ్డ ప్రకృతి, జీవన విధ్వంసాలను చిత్రించిన పి. చంద్ నవల ‘దేవుని గుట్ట‘ (Rs. 190/-), ఒక మాదిగపల్లె సామాజిక, సాంస్కృతిక జీవితాన్ని జానపద సౌందర్యంతో చెప్పిన ఎండపల్లి భారతి కథలు ‘పచ్చబొట్టు’ (Rs. 150/) ఈ ఏడాది బుక్ ఫెయిర్ కి పర్స్పెక్టివ్ ప్రచురణలుగా తెస్తున్నాం.

image.jpeg

ఆర్కే

పర్స్పెక్టివ్ ప్రచురణలు

గడచిన రెండేళ్ళుగా ఛాయ ప్రధానంగా అనువాదాల మీద దృష్టి సారించింది. గత ఏడాది దేశీ అనువాదాలు, ఈ ఏడాది అంతర్జాతీయ సాహిత్యానువాదాల కోసం విదేశీ అనే సిరీస్ మొదలుపెట్టాం. బాబిగాడి వీరచరితం (నార్వేజియన్), మనుషులు మాయమయ్యే కాలం (అమెరికన్) అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఫీనిష్ క్రైమ్ థ్రిల్లర్ అయిన ది నవలలను, ఐస్ లాండిక్ డిటెక్టివ్ ఫిక్షన్ జార్ సిటీని అవే పేర్లతో తెలుగులోకి తెచ్చాం. 2023 నోబెల్ బహుమతి గ్రహీత యున్ ఫొస్సా చిన్నినవలను ‘మెరుపు’గా తీసుకువస్తున్నాం. ఈ ఏడాది ఇంటర్నేషనల్  బుకర్ బహుమతి పొందిన హార్ట్ లాంప్ కథలను హృదయదీపంగా తీసుకువస్తున్నం. ఈ ఏడాది ప్రచ్ఛాయ అనే మరో ఇంప్రింట్ పెట్టాం. అందులోనూ ఎక్కువగా అనువాదాలే వచ్చాయి. మహాశ్వేతాదేవీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కథలనుండి ఆధునిక బెంగాలికథల వరకు రెండు కథాసంపుటులు, ఒక నవల, మధురాంతకం నరేంద్ర నవల, ఎండపల్లి భారతి నవల, మేడి చైతన్య తొలి కథాసంపుటీ తెస్తున్నాం. తల్లావఝల  పతంజలిశాస్త్రి మార్జిన్ లాండ్స్ పుస్తకాన్ని ‘చెరిగిపోతున్న చివరి సరిహద్దులుగా అనువాదం’ చేశారు. సుందర్ సరుక్కై రాసిన ఫాలోయింగ్ ఏ ప్రేయర్ అనే నవలను ‘ప్రార్థన జాడల్లో’గా కాత్యాయని అనువాదం చేశారు. అవీ ఈ బుక్ ఫెయిర్ లోనే.

image.jpeg

అరుణాంక్ లత

ఛాయ పబ్లికేషన్స్

సాహిత్యం కేవలం వినోదం కాదు, అది సమాజాన్ని నడిపించే మార్గం కూడా అనే అవగాహనతో 2024లో ఎన్నెలపిట్ట ప్రచురణరంగంలోకి వచ్చింది. కథలు, నవలలు, కవిత్వంతో పాటు సామాజిక స్పృహ కలిగించే రచనలను పాఠకుల ముందుకు తీసుకొస్తోంది. జమిల్యా వంటి క్లాసిక్ నవలికలను కొత్త అనువాదాల్లో పరిచయం చేస్తూ, డా. బి.ఆర్. అంబేద్కర్ కులంపై రాసిన వ్యాసాలు, మహాద్, అలల కాలం వంటి చారిత్రక, సామాజిక రచనలు ప్రచురించింది. యువ, సీనియర్ కవుల కవిత్వం, హిందీ, తమిళ, ఆఫ్రికన్, రష్యన్ అనువాదాలతో సాహిత్య పరిధిని విస్తరించింది. ఎన్నెలపిట్ట ఇప్పటివరకు 27 పుస్తకాలు ప్రచురించింది. ఇందులో ఈ సంవత్సరం వచ్చినవి 18. ఒకటి రెండు పుస్తకాలు తప్ప, దాదాపు అన్నీ రీప్రింట్ కి వచ్చాయి.

image.jpeg

శేషు కొర్లపాటి

ఎన్నెలపిట్ట ప్రచురణలు

మేము ఒక… పబ్లికేషన్స్. మాకు కొత్తా కావాలి, పాతా కావాలి. కొత్తకీపాతకీ మధ్య ఒక బ్రిడ్జ్ అవసరమని నమ్ముతున్నాం. ఈ నెలలో ఏడు కొత్త పుస్తకాలను తెస్తున్నాం. ఇండస్ మార్టిన్ ‘AC కాలేజ్ కథలు’, అరుణాంక్ లత ‘రాజకీయ వ్యాసాలు’, మెర్సీ మార్గరేట్ ‘పిక్చర్ పొట్లం, మానస చామర్తి ‘జీవితానికో చందమామ’, బండ్లమూడి స్వాతికుమారి ‘అరసున్నా’, యువరాణి ‘బ్యాక్ స్పేస్ బటర్ ఫ్లై’, గౌతమ్ ‘కృష్ణపక్షం’. వీటితో పాటుగా ఇప్పటికీ సాహితీలోకంలో రీ సౌండ్ చేస్తోన్న కుప్పిలి పద్మ కథలనూ, కె ఎన్ మల్లీశ్వరి ‘జాజిమల్లి’నీ, ఇండస్ మార్టిన్ ‘కటికపూలు’నూ తెస్తున్నాం. అవీఇవీ కలిపి మొత్తంగా పది పుస్తకాలు. ఇవన్నీ జీవితంలో నుంచి రాలిన శకలాలు అనీ, ఈ లోకాన్ని ఎంతో కొంత ముందుకు నడిపించేవి అనీ నమ్ముతున్నాం. భూమ్మీద ఉన్న సమస్త అసమానతల్లో ఏదో ఒక అసమానతకు ఇవి ఎదురుగా నిలబడతాయని ధీమాగా ఉన్నాం.

image.jpeg

కట్టా సిద్ధార్థ

ఒక… ప్రచురణలు

 

సాహిత్య సమాచారం

సంగిశెట్టికి జాతీయ పురస్కారం

ఎదిరెపల్లి మశమ్మ స్మారక జాతీయ పురస్కారం ఈ ఏడాది- ప్రముఖ రచయిత చరిత్ర పరిశోధకులు డా. సంగిశెట్టి శ్రీనివాస్ కి ఇవ్వనున్నట్లు పురస్కార కమిటీ చైర్మన్ ఎదిరెపల్లి కాశన్న తెలిపారు. 2025 డిసెంబర్ 21 వ తేదీ- ఆదివారం ఉదయం 10 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సింగిల్ విండో హల్లో జరిగే ఈ సభకు ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ గోరటి వెంకన్న, ప్రసిద్దకవి విమర్శకులు డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి హజరవుతారని, ఈ పురస్కారం కింద ఇరవైవేల నగదు, జ్ఞాపిక అందచేస్తామని తెలిపారు. కవులు కళాకారులు రచయితలు విద్యార్థులు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి

image.jpeg

ఎదిరెపల్లి కాశన్న

ఎదిరెపల్లి మశమ్మ పురస్కార కమిటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *