- వరుస ఎన్‌కౌంటర్ల తరవాత 37మంది లొంగుబాటు
– లొంగిపోయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్
- గణపతి తదితరులంతా అజ్ఞాతం వీడి రావాలన్న డీజీపీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. వరుస ఎన్‌కౌంటర్ల తరవాత తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 25 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు వంటి పలువురు అగ్రనేతలు ఉన్నారు. లొంగుబాటు సందర్భంగా మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 303 రైఫిల్స్, జీ-3 రైఫిల్స్, ఎకె-47లు, భారీగా బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేశ్, సోమ్‌దా అలియాస్ ఎర్ర ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు. మిగతా 34 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు డివిజనల్ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నట్లు చెప్పారు. అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వీరంతా జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చినట్లు డీజీపీ వెల్లడించారు. 37 మందికి తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేలు అందజేశారు. ములుగు జిల్లాకు చెందిన ఆజాద్‌పై రూ.20 లక్షలు, అప్పాస్ నారాయణపై రూ.20 లక్షల రివార్డు ఉంది. వీరితోపాటు లొంగిపోయిన మావోయిస్టులందరిపైనా కలిపి మొత్తం రూ.1.41కోట్ల రివార్డు ఉంది. ఆ మొత్తాన్ని వారికే అందజేస్తామని తెలిపారు. తెలంగాణకు చెందిన వారికి ప్రభుత్వ పునరావాస ప్యాకేజీ అందిస్తాం. తెలంగాణకు చెందిన మరో 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, పాక హనుమంతు అలియాస్ గణెళిశ్, బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారని తెలిపారు. అంతేకాక రాష్ట్ర కమిటీలో 10 మంది ఉన్నారని, వీళ్లంతా వీలైనంత త్వరగా లొంగిపోవాలని సూచిస్తున్నాం అని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలు వివరించారు. ఏ రకంగా బయటికి వొచ్చినా మావోయిస్టులను అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు. మీడియా ద్వారా వొచ్చినా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వొచ్చినా, రాజకీయ నాయకుల ద్వారా వొచ్చినా తాము స్వాగతిస్తామని డీజీపీ పేర్కొన్నారు. మావోయిస్టులు పార్టీ పరంగా విబేధాలు, ఆరోగ్య కారణాలు, ఇలా అనేక కారణాలతో బయటికి వస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడుగా ఉన్న ఆజాద్ 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. 11 నెలల్లో 465మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో 59మంది తెలంగాణకు చెందిన వారని డీజీపీ వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





