31‌న రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశం

  • వరదలు, ఆర్‌టీసి ఉద్యోగుల జీతాల పెంపు
  • పలు అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం
  • ఆగస్టు 3 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : ఈ నెల 31 సోమవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశాన్ని నిర్వహించాలని సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయించారు. డా।। బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో భారీ వర్షల నేపథ్యంలో వరదలు, అందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సహా 40 నుంచి 50 లంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో జోరుగా వ్యవసాయ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాల వల్ల వ్యవసాయ రంగానికి సంబంధించి విపత్కర పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడం…అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కూడా కేబినెట్‌ ‌చర్చించనున్నది.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. రోడ్ల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్‌ ‌చర్చించనున్నది. ఇంకా ఆర్‌టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్‌ ‌చర్చించనున్నది. ఆర్‌టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్‌ ‌తగు నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

ఆగస్టు 3 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 28 : ఆగస్టు నెల 3వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ని రోజులన్నది బిఎఎసి సమావేశంలో నిర్ణయిస్తారు. చర్చించే వివిధ అంశాలను కూడా ఇందులో ఖరారు చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *