30‌న కాంగ్రెస్‌ ‌పాలమూరు ప్రజా భేరి

  • విజయవంతం చేయడానికి హస్తం సన్నాహాలు
  • హాజరుకానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ
  • ఇదే వేదికపై పార్టీలోకి జూపల్లితో సహా పలు చేరికలు
  • సెల్ఫీ విత్‌ ‌కాంగ్రెస్‌..‌ప్రజల్లోకి వెళ్లేందుకు హస్తం నేతల ప్లాన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 26 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత ప్రియాంకగాంధీ హాజరయ్యే పాలమూరు ప్రజాభేరీ బహిరంగ సభను.. హస్తం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రైతు డిక్లరేషన్‌, ‌యూత్‌ ‌డిక్లరేషన్‌ ‌సహా ఇప్పటికే పలు ప్రజాకర్షక ఎన్నికల హామీలను ప్రకటించిన కాంగ్రెస్‌.. ‌కొల్లాపూర్‌లో జరిగే సభ ద్వారా మహిళా డిక్లరేషన్‌కు సిద్ధమవుతుంది. మహిళలకు ఏ పార్టీ ఇవ్వని విధంగా, గతంలో ఎప్పుడూ లేని హామీలను ప్రియాంక.. ప్రకటించనున్నారని నేతలు చెబుతున్నారు. ఇదే సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, గురునాథ్‌ ‌రెడ్డి సహా..కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు.  ఖమ్మంలో జరిగిన రాహుల్‌ ‌గాంధీ సభ తర్వాత..ఈ నెల 30న నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా కొల్లాపూర్‌ ‌వేదికగా కాంగ్రెస్‌ ‌తలపెట్టిన పాలమూరు ప్రజాభేరి విజయవంతానికి హస్తం పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ..ఆ సభకు హాజరుకానుడటంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీలు, సీనియర్‌ ‌నేతలతో సన్నాహాక సమావేశాన్ని మహబూబ్‌ ‌నగర్‌లో నిర్వహించారు. కేసీఆర్‌ ‌పాలన వైఫల్యాలను నిలదీయడంతో పాటు.. కాంగ్రెస్‌ ‌గెలిస్తే ఏం చేయబోతోందో ఆ సభ ద్వారా ప్రజలకు వివరించాలని కాంగ్రెస్‌ ‌భావిస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా..గతంలో ఎప్పుడు లేని విధంగా మహిళా డిక్లరేషన్‌ ‌ప్రకటించనున్న నేపథ్యంలో కొల్లాపూర్‌ ‌సభకు పెద్ద ఎత్తున మహిళలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాలమూరు ప్రజాభేరి విజయవంతానికి ఇప్పటికే జిల్లాలోని 14 నియోజకవర్గాలకు సీనియర్‌ ‌నేతలతో బాధ్యులను ప్రకటించిన పీసీసీ.. ప్రత్యేక బాధ్యులుగా మహిళా నాయకురాళ్లను నియమించనుంది. మహిళా డిక్లరేషన్‌తో పాటు.. పలు ప్రజాకర్షక హామీలను కొల్లాపూర్‌ ‌సభ ద్వారా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.

కొత్తగా చేరుతున్న నేతలు, ఇన్నేళ్లు పార్టీకి సేవచేసిన నేతల మధ్య విభేదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతా కలసికట్టుగా శ్రమించి సభను విజయవంతం చేయాలని..తద్వారా కాంగ్రెస్‌ ‌బలాన్ని చాటాలని ఏఐసీసీ నాయకులు రాష్ట్ర నాయకత్వానికి సూచించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్‌ ‌పార్టీకి అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకరి కంటే ఎక్కువమంది ఆశావహులున్నారు. ఎన్నికల్లో టికెట్‌ ‌దక్కుతుందన్న ఆశతో పార్టీకి సేవలు చేస్తూ వొస్తున్నారు. ఎన్నికలకు ముందు కొత్త నేతల చేరికతో వారిలో గందరగోళం మొదలైంది. పాత వాళ్లకే టిక్కెట్లు ఇవ్వాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లోనూ విభేదాల్ని పక్కనపెట్టి సభ విజయవంతంపై దృష్టి సారించేలా నాయకత్వం చర్యలు చేపట్టింది.

సెల్ఫీ విత్‌ ‌కాంగ్రెస్‌..‌ప్రజల్లోకి వెళ్లేందుకు హస్తం నేతల ప్లాన్‌
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార బీఆర్‌ఎస్‌ను ఎదుర్కునేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ తనదైన వ్యూహాలను అమలు చేస్తుంది. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలు చేపడుతుంది. 109 రోజుల పాటు 1360 కిలోమీటర్లు అదిలాబాద్‌ ‌నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తాజాగా మరొక కొత్త కార్యక్రమంతో.. జనం ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సెల్ఫీ విత్‌ ‌కాంగ్రెస్‌ ‌డెవలప్‌మెంట్‌ అం‌టూ.. ఓ సరికొత్త కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

గడిచిన 50 సంవత్సరాలల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సెల్ఫీ విత్‌ ‌కాంగ్రెస్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్యక్రమాన్ని ఎంచుకుంది. ఇప్పటి తరానికి కాంగ్రెస్‌ ‌హయాంలో చేసిన అభివృద్ది సంక్షేమం గురించి తెలియదని.. తద్వారా పార్టీ కొంత వెనుకబడుతున్నట్లు రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. దేశం, రాష్ట్రానికి కాంగ్రెస్‌ ‌చేసిన సేవలను.. సంక్షేమ, అభివృద్ధి పథకాలు మరుగునపడిపోకుండా ఉండేందుకు సెల్ఫీ విత్‌ ‌కాంగ్రెస్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *