– భారీగా ఓటింగ్ శాతం నమోదు
– అంతటా ప్రశాంతం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు పుదుచ్చేరిలో 86.92 శాతం, అసోంలో 84.42 శాతం, కేరళంలో 75.01 శాతం పోలింగ్ నమోదు అయిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అసోంలో 126, కేరళంలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు. కేరళం, పుదుచ్చేరిలలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగా అసోంలో ఐదు గంటలకే పూర్తయ్యింది. మూడు ప్రాంతాల్లోనూ ఈసారి భారీ సంఖ్యలో ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళంలోని 140 నియోజకవర్గాల్లో 2.71 కోట్ల మంది ఓటర్లు ఉండగా సాయంత్రం 5గంటల వరకు 75శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కోజికోడ్‌లో అత్యధికంగా 77శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో 74.06శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి స్వల్పంగా పెరిగింది. అసోంలో 126 నియోజకవర్గాల్లో 2.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 5గంటల వరకు 84శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గత ఎన్నికల్లో 82శాతం నమోదు కాగా ఈసారి మరింత పెరిగింది. దల్‌గావ్‌లో అత్యధికంగా 94.57శాతం పోలింగ్ నమోదైంది. పుదుచ్చేరిలోనూ భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. ఐదు గంటలÁకే 86శాతం పోలింగ్ నమోదు కాగా ఇది మరింత పెరగనుంది. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ క్యూ లైన్‌లలో ఉన్నవారికి టోకెన్లు ఇచ్చి పోలింగ్‌కు అనుమతించినట్లు సమాచారం. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 23న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు 23, 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నట్లు, మే 4న ఈ ఐదు రాష్టాల్లో ఓట్ల లెక్కింపు పక్రియ చేపడతామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





