– తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
– ప్రధాని, రైల్వేశాఖ మంత్రికి ధన్యవాదములు
న్యూదిల్లీ, మార్చి 13: ఆయా మార్గాలలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, ప్రస్తుతం కొన్ని మార్గాలలో ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్కనుగుణంగా సేవలందిస్తున్న మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మారుస్తూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేలు జరగనుంది. రైలు నం.07191/07192 కాచిగూడ-మధురై-కాచిగూడ రైలును రైలు నం.17165/17616 కాచిగూడ-ట్యుటికోరిన్-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో మొదలై మరుసటి రోజు మంగళవారం రాత్రి 10:45 గంటలకు కేరళ రాష్ట్రంలోని ట్యూటికోరిన్‌కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ట్యూటికోరిన్ నుంచి బుధవారం ఉదయం 7:45 గంటలకు మొదలై మరుసటి రోజు మధ్యాహ్నం 1:25కు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది. రైలు నం.07230/07229 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ రైలును రైలు నం.17069/17070 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ఈ రైలు గతంలోలాగే ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2:30కు తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా గతంలోలాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 5:15కు కన్యాకుమారిలో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 2:30 కు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది. రైలు నం.07225/07226 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి రైలును రైలు నం.17065/17066 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్‌గా మార్చారు. ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15కు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు బుధవారం ఉదయం 11:20కు పశ్చిమ బెంగాల్ షాలిమార్‌కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50కు షాలిమార్‌లో బయలుదేరి మరుసటి రోజు గురువారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం
మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ భారతీయ రైల్వే తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.36,286 కోట్ల రైల్వే బడ్జెట్‌ను కేటాయించారని, ప్రస్తుతం రాష్ట్రంలో రూ.47,984 కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రూ.2,668 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 రైల్వే స్టేషన్లను అధునాతన సౌకర్యాలతో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు, తద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. రానున్న రోజులలో మరిన్ని అధునాతన రైళ్లు, రద్దీ ఉన్న మరిన్ని కొత్త మార్గాలకు రైలు సేవలను అందుబాటులోకి తేవటానికి కృషి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





