దత్తత తీసుకున్నా 3 నెలల సెలవులు ఇవ్వాల్సిందే

– పితృత్వ సెలవులపైనా నిర్ణయం తీసుకోవాల్సిందే
– పిల్లల పెంపకంలో తండ్రులకు కూడా భాగస్వామ్యం
– ప్రసూతి సెలవుల విచారణలో ‘సుప్రీమ్‌’ ‌కీలక ఆదేశాలు

న్యూదిల్లీ, మార్చి 17: ప్రసూతి సెలవుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మూడు నెలల కంటే త‌క్కువ‌ వయసు ఉన్న బిడ్డను ఒక మహిళ దత్తత తీసుకుంటే.. ఆమెకు ప్రసూతి సెలవులను నిరాకరించడం సరికాదని తీర్పులో పేర్కొంది. ఆ బిడ్డ వయసుతో సంబంధం లేకుండా ఆ తల్లికి 12 వారాల సెలవు పొందడానికి అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. దత్తత వంటి మార్గాల్లో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం చట్టబద్ధమేనని వ్యాఖ్యానించింది. దత్తత తీసుకున్న బిడ్డకు కన్నబిడ్డకు మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ప్రసూతి సంరక్షణ కనీస హక్కు అని పేర్కొంది. మెటర్నిటీ బెనిఫిట్‌ ‌యాక్ట్ ‌ప్రకారం.. 3 నెలల కంటే తక్కువ వయసు ఉన్న బిడ్డను దత్తత తీసుకునే మహిళా ఉద్యోగులు 12 వారాలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు తీసుకోవడానికి అర్హత ఉంది. ఈ క్రమంలో పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్రానికి సుప్రీంకోర్టు తాజాగా సూచించింది. పిల్లలు, వారి తల్లిదండ్రుల అవసరాలకు అనుగుణంగా సెలవులను నిర్ణయించాలని పేర్కొంది. మాతృత్వ సెలవులపై కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు మంగళవారం పితృత్వ సెలవులపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తండ్రులకు కూడా సెలవులు ఉండాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని పేర్కొంది. తండ్రికి కూడా సమాన బాధ్యత ఉంటుందని తెలిపింది. మాతృత్వ సెలవుల తరహాలోనే.. వేతనంతో కూడిన పితృత్వ సెలవులు కల్పించాలని సూచించింది. పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష తగ్గాలంటే ఇలాంటి చట్టాలు అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. పితృత్వ సెలవులు ప్రైవేట్‌ ‌రంగంలోనూ అమలు చేసేలా నిబంధనలు రూపొందించాలని కేంద్రానికి సూచించింది. పిల్లల ఎదుగుదలలో తండ్రి పాత్రను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఇక మూడు నెలలలోపు వయసున్న పిల్లల్ని దత్తత తీసుకున్న మహిళలకు మాత్రమే 12 వారాల మాతృత్వ సెలవులను కేటాయించడం సరికాదని కూడా సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు సోషల్‌ ‌సెక్యూరిటీ కోడ్‌-2020‌లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. దత్తత తీసుకున్న పిల్లల వయసుతో సంబంధం లేకుండా తల్లులకు 12 వారాల మాతృత్వ సెలవులు మంజూరు చేయాలని స్పష్టం చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *