3 ‌గంటల కరెంట్‌ ‌పార్టీ కావాలా?

  • 3 పంటలకు 24 గంటల ఉచిత కరెంట్‌ అం‌దించే బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కావాలా?
  • రైతులు ఆలోచించాలని రాఘవాపూర్‌ ‌రైతు సమావేశంలో మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 19 : వ్యవసాయానికి 3గంటల కరెంటు అందించే పార్టీ కావాలా? 3 పంటలకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంట్‌ను అందించే బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం కావాలా? రైతులే ఆలోచన చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు రైతులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం సిద్ధిపేట రూరల్‌ ‌మండలంలోని రాఘవాపూర్‌లో గల రైతు వేదికలో 24 గంటల కరెంటు, కాంగ్రెస్‌ ‌పార్టీ నేతల వ్యాఖ్యలపై నిర్వహించిన రైతు సమావేశానికి మంత్రి హరీష్‌రావు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వ హయాంలో పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిపోయే మోటర్లు ఉండేవన్నారు.

తెలివి లేని కాంగ్రెస్‌ ‌నాయకులు 3గంటల కరెంట్‌ ‌సరిపోతదంటున్నారనీ, ఇప్పటి వరకు రైతుబంధు కింద 11 విడతల్లో 72 వేల కోట్ల రూపాయలు అందించిన ఘనత సిఎం కేసీఆర్‌దేననీ అన్నారు. 24 గంటల కరెంట్‌ ‌కోసం ప్రతి యేటా 12వేల కోట్ల రూపాయల  ఖర్చు చేస్తున్నామనీ,  కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఎండ కాలంలో కూడా పెద్ద చెరువు నిండుకుండలా నిండిందన్నారు. రాఘవాపూర్‌ ‌గ్రామంలో 40 మంది రైతులకు రైతుబీమా అందించామనీ,  ఇప్పటి వరకు రాష్ట్రంలో 1 లక్ష 6 వేల 74 మంది రైతులకు రైతుబీమా అందించామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా  చంద్రబాబు నాయుడు వారసుడు రేవంత్‌రెడ్డి అని,  ఒకనాడు బతుకుదెరువు కోసం తెలంగాణ వాళ్లు పక్క రాష్ట్రాలకు పోతే… ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వరినాట్లు వేయడానికి కార్మికులు వలస వచ్చే స్థితికి తెలంగాణ చేరిందన్నారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, ప్రతి ఒక్క రైతు ఆలోచించాలని మంత్రి హరీష్‌రావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *