భద్రాచలం, రామప్ప దేవాలయాలను దర్శించుకోనున్న రాష్ట్రపతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ నెల 28 బుధవారం రోజున రాష్ట్ర పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఆమె భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకుని రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాదం ప్రత్యేక నిధులతో నిర్మించబోయే కాటేజ్లకు శంఖుస్థాపన, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం రామాప్ప దేవాలయాల దర్శనానికి వెళ్ళనున్నారు. రామప్ప అభివృద్ధి కోసం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కిన సంగతి తెలిసిందే.




