హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : తిరుమల తిరుపతి దేవస్థానములు(హైదరాబాద్) జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో డిసెంబర్ 23 న వైకుంఠ ఏకాదశి, 24 న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ డిప్యూటీ ఈవో రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం హిమాయత్‌నగర్ బాలాజీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ ఈవో రమేష్ బాబు మాట్లాడుతూ డిసెంబర్ 23 న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 1 గంటల నుండి 3 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. సర్వదర్శనం ఉదయం 3.30 గంటలకు ప్రారంభం అవుతుందని అన్నారు. వీఐపీలు, ప్రోటోకాల్ ప్రముఖులు ఉదయం 3 గంటలకు రిపోర్టు చేయాలని, సాయంత్రం 6 నుండి 6.45 గంటల వరకు నైవేద్య విరామ సమయం ఉంటుందన్నారు. తిరిగి సా.6.45 గంటల నుండి సర్వ దర్శనం ప్రారంభం అవుతుందన్నారు. సా.7.30 గంటలకు వరకు తోమాల, కొలువు, పంచాంగ శ్రావణం నిర్వహిస్తామని తెలిపారు. ఈ పర్వదిన కారణంగా డిసెంబర్ 23న ఆర్జిత కళ్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసిందని తెలిపారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. ఈ సమావేశంలో టీటీటీ జూబ్లీహిల్స్ టెంపుల్ ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు వెంకట్ రెడ్డి, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.
23 నుంచి టీటీడీలో ‘వైకుంఠ ఏకాదశి-ద్వాదశి’ కార్యక్రమాలు



