హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 : ఈనెల 23న దసరా పర్వదినం సందర్బంగా చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ప్రముఖ సంస్కృతిక సంస్థలు ‘మధురం’, ‘కళా విపంచి’ సంయుక్తాధ్వర్యంలో శ్రీ సాయి సంతోషి నాట్యమండలి(స్టేషన్ ఘనపూర్) 20 మంది సురభి కళాకారులచే 23 న ‘ఘంటసాల నాటకం, 24న ‘కత్తి కాంతారావు’ నాటకాలను సాయంత్రం 6 గం. లకు ప్రదర్శించుతున్నట్లు ప్రముఖ రచయిత, దర్శకుడు భాస్కరుని సత్యజగదీశ్, కళ పత్రిక సంపాదకుడు డాక్టర్ మహ్మద్ రఫీలు వెల్లడించారు. ఈ మేరకు శనివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నాటకాన్ని బ్రతికించడానికి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద సురభిక ళాకారులకు చేయూత ఇవ్వడానికి ఘంటసాల, కత్తి కాంతారావు నాటకాలను రచించి, దర్శకత్వం వహించడమే కాకుండా, అనేక వ్యయ ప్రయాసలకోర్చి ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఘంటసాల నాటకం 20వ ప్రదర్శన, కత్తి కాంతారావు నాటకం రెండవ ప్రదర్శన జరుగుతుందన్నారు. ఘంటసాల మాస్టారి, కాంతారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కనీసం 100 ప్రదర్శనలు జరపాలన్నది సంకల్పంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ సలహాదారు కెవి.రమణాచారి, సినీ రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ, సంస్కృతిక సంస్థల వ్యస్థాపకులు డా. వంశీ రామరాజు, మద్దాలి రఘురామ్, డా. కేవీ.కృష్ణకుమారి, సంజయ్ కిషోర్ తదితరులు పాల్గొంటారని వారు తెలిపారు.
23, 24న ఘంటసాల, కత్తి కాంతారావు నాటకాల ప్రదర్శన





