22‌న తిరుమలలో ఉగాది ఆస్థానం

తిరుమల, మార్చి 13 : శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన ఉగాది ఆస్థానానం జరగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 21న ఆలయ అధికారులు కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం నిర్వహించనున్నారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.  ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు.

ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు. శుద్ధి పూర్తయిన తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్తోక్త్రగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *