ఒకేచోట 2,160 ఇందిర‌మ్మ ఇళ్లు

– తొలి విడ‌త‌లో వెయ్యిమందికి పంపిణీ
– మార్చి మొద‌టి వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
– పార‌ద‌ర్శ‌కంగా ల‌బ్దిదారుల ఎంపిక
–  ఒక్కో ఇంటికి రూ.6ల‌క్ష‌ల వ్య‌యం
– మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: : రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంతంలో 2,160 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టి పేదలకు అందిస్తున్నామని పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.  మంగళవారం హుజూర్ న‌గర్‌లోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాల విస్తీర్ణంలో రూ.125 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ప్రాజెక్టును హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2011లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే హుజూర్నగర్ నియోజకవర్గం లోని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, రైస్ మిల్లులో పనిచేసే కార్మికులకు ఆశ్రయం కల్పించాలనే లక్ష్యంతో 110 ఎకరాల దేవాలయ భూమిని మార్కెట్ ధరకు కొనుగోలు చేసి పనులు ప్రారంభించామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఈ పనులను మధ్యలోనే నిలిపివేసి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 14 ఏళ్ల తన పట్టుదల, కృషి ఫలితంగా ఈ ప్రాజెక్టును పునఃప్రారంభించి పూర్తి దశకు తీసుకువచ్చామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పేదలకు అందించడం తన చిరకాల స్వప్నం నెరవేరుతున్నద‌ని భావిస్తున్నానన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఖర్చు చేస్తున్నామని, ప్రతి ఇల్లు 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని వివరించారు. అదనంగా రూ.75 కోట్లతో అంతర్గత రహదారులు, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించిందన్నారు. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తొలి విడతలో హుజూర్ న‌గర్ పట్టణానికి చెందిన ఇళ్లు లేని నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు కలిగిన 1,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. రెండవ విడతలో ఇతర పేదలకు ఇళ్లను అందజేస్తామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్, తహసీల్దార్‌లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎంపికలో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్పీ కే.నరసింహ, మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *