- పౌరుల మరణాల్లో 80 శాతం తగ్గుదల…6000 మిలిటెంట్ల లొంగుబాటు
- కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
పీఐబీ ,హైదరాబాద్, డిసెంబర్ 19 : ‘‘తీవ్రవాద నిర్మూలన పట్ల ప్రభుత్వ పట్టుదల పదే పదే నిరూపితమవుతుంది. సర్జికల్ దాడి మొదలు బాలకోట్ దాడి దాకా అది చూశాం. మన సాయుధ దళాల చర్యల వలన జమ్ము కాశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాలు తగ్గాయి. అదే విధంగా తీవ్రవాద కార్యకలాపాలకు నిధులందటాన్ని దాదాపు 94శాతం తగ్గించగలిగాం..తీవ్రవాదాన్ని ఎంత మాత్రమూ సహించే ప్రసక్తే లేదన్న భారతదేశం ఆ విధానం మీద దృష్టి సారించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. సోమవారం మంత్రి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటన విడుదల చేశారు. చట్టపరంగా యూఏపీఏను బలోపేతం చేయటం మీద ఒకవైపు ప్రభుత్వం పనిచేస్తుందని, మరోవైపు అమలుపరంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) సమర్థంగా పనిచేయటానికి సవరణ చట్టం చేసామని చెప్పారు.
ఈ చర్యలన్నీ కలసికట్టుగా తీవ్రవాద పర్యావరణాన్ని బలహీనపరుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తీవ్రవాదాన్ని అంత మొందించాల్సిన అవసరాన్ని అంతర్జాతీయ వేదికల మీద భారతదేశం బలంగా చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. తీవ్రవాదం మీద పోరుకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెబుతూ వొస్తున్నారన్నారు. దిల్లీలో జరిగిన 90 వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీలో 2000 మందికి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనగా తీవ్రవాద కార్యకలాపాల మీద అంతర్జాతీయ చర్యలకు పూనుకోవాలన్న తీర్మానంతో ముగియటాన్ని ఆయన ప్రస్తావించారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా మంత్రి సుదీర్ఘంగా ప్రస్తావించారు. ఈశాన్య భారతంలో 2014 నుంచి శాంతియుగం మొదలైందని తీవ్రవాద చొరబాట్లు 80 శాతం తగ్గగా పౌరుల మరణాలు 89 శాతం తగ్గాయన్నారు.
దీనికి తోడు 2014 తరువాత దాదాపు 6 వేలమందికి పైగా తీవ్రవాడులు లొంగిపోయారన్నారు. తీవ్రవాదాన్ని అదుపు చేయటానికి సాయుధ దాడులకు మించి చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అప్పుడే ప్రజలకు శాంతియుతమైన జీవితాన్ని అందించినట్టవుతుందన్నారు. శాంతి ఒప్పందాలు చేసుకోవటం ద్వారా కూడా ప్రభుత్వం ఎంతో ముందడుగు వేసిందని గుర్తు చేశారు. ఈ విషయానికున్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ ప్రభుత్వం సంతకాలు చేసిన వివిధ శాంతి ఒప్పందాలను విడుదల చేసిన ప్రస్తావించారు.




