‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించి చారిత్రిక సంఘటనలలో 2013 డిసెంబర్ 17కూడా ఒక మరుపు రాని దినం. రాష్ట్ర విభజన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్తీకరణ బిల్లు – 2013 ముసాయిదాను రాష్ట్ర ఉభయ సభలు… శాసనసభ, శాసనమండలి లోనూ 2013 డిసెంబర్ 17న ప్రవేశపెట్టారు.’’
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించి చారిత్రిక సంఘటనలలో 2013 డిసెంబర్ 17కూడా ఒక మరుపు రాని దినం. రాష్ట్ర విభజన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్తీకరణ బిల్లు – 2013 ముసాయిదాను రాష్ట్ర ఉభయ సభలు… శాసనసభ, శాసనమండలి లోనూ 2013 డిసెంబర్ 17న ప్రవేశపెట్టారు. 65 పుటలు, 13 షెడ్యూళ్ళు ఉన్న సదరు బిల్లును తెలుగు, ఉర్దూ భాషల్లో స్వేచ్చానువాదం చేసి, ప్రతులను సభ్యులకు పంచిపెట్టారు. అలాగే శాసనసభ వెబ్ సైట్ లో కూడా బిల్లును అందుబాటులో ఉంచినట్లు నాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఒక్కో షెడ్యూల్ ను విభజనకు సంబంధించిన ఒక్కో అంశాన్ని వివరించడానికి కేటాయించారు. నీటి విభజనకు ఒక షెడ్యూల్, ఉద్యోగులు అధికారుల విభజనకు ఒక షెడ్యూల్, శాసన మండలి విభజనకు ఒకటి… ఇలా ఏయే ప్రాంతంలో ఎన్ని పరిశ్రమలు ఉన్నదీ, ఎన్ని విద్యా సంస్ధలు, ఆసుపత్రులు ఉన్నదీ, తదితర వివరాలన్నీ వివిధ షెడ్యూళ్లలో పొందుపరిచినట్లు ప్రకటించారు.
తెలంగాణా ప్రాంత శాసన సభ్యులంతా ముసాయిదా బిల్లును స్వాగతించగా, సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో నిర్ణయించకుండా సభలో చర్చను ప్రారంభించడాన్ని సీమాంధ్ర ప్రాంత సభ్యులు వ్యతి రేకించారు.
శాసనసభ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాక దాదాపు అన్ని పార్టీల సభ్యులు ప్రత్యేక తెలంగాణ అనుకూల, వ్యతిరేక నినాదాలతో స్పీకర్ పోడియం ను చుట్టుముట్టి పోటాపోటీగా గొడవ చేశారు. 30 నిమిషాల వాయిదా అనంతరం తిరిగి సమావేశం అయిన సభలో స్పీకర్ తనకు రాష్ట్రపతి నుండి బిల్లు ముసాయిదా అందినట్లు ప్రకటించారు. స్పీకర్ ఆదేశాల మేరకు శాసన సభ కార్యదర్శి ఎస్.రాజసదారాం బిల్లు ముసాయిదాకు అనుబంధంగా పంపిన లేఖను చదివి వినిపించారు. 2014 జనవరి 23వ తేదీ లోగా, బిల్లుపై చర్చించి, బిల్లును వెనక్కి పంపాలని రాష్ట్రపతి తమ సందేశంలో పేర్కొన్నట్లు శాసనసభ కార్యదర్శి రాజా సదారాం సభలో తెలిపారు. గొడవ, నినాదాలు, ప్రతి నినాదాలు కొనసాగడంతో స్పీకర్ మరో 30 నిమిషాలు సభను వాయిదా వేశారు.
ఆ నాటి ఉదయం శాసనసభ సమావేశం కాగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, సమైక్య రాష్ట్రాల మద్దతుదారులు సభలో గందరగోళం పరిస్థితులు సృష్టించడంతో సభా కార్యకలాపాలు గంటపాటు వాయిదాపడ్డాయి. సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేక పోవడంతో స్పీకర్ సభను రెండుసార్లు వాయిదా వేయవలసి వచ్చింది. ఆరోగ్యం బాగా లేదంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభకు గైర్హాజరయ్యారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ను సంప్రదించిన స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లును శాసన సభలో ప్రవేశ పెట్టినట్లు ప్రకటించారు. చర్చను వెంటనే ప్రారంభించాలన్న శ్రీధర్ బాబు కోరిక మేరకు చర్చను ప్రారంభించాల్సిందిగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును, స్పీకర్ స్ధానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోరారు. అయితే టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీమాంధ్ర శాసన సభ్యులు బిల్లు కాపీలను చింపి వేసి సమైక్య రాష్ట్రంకు మద్దతుగా నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డు కున్నారు. ప్రతిపక్ష నాయకుడు సభలో లేక పోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్థానం లో ఉన్న ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క సభను మరుసటి రోజుకు వాయిదా వేసారు.
శాసనమండలి లోనూ సభా ధ్యక్షుడు చక్రపాణి బిల్లును ప్రవేశ పెట్టగనే తెలుగు దేశం, సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులు పోడియంను చుట్టు ముట్టి రభస సృష్టించడంతో సభ తెల్ల వారటికి వాయిదా పడింది. సచివాలయంలో సీమాంధ్ర తెలంగాణ ఉద్యోగులు పోటా పోటీగా ర్యాలీలు నిర్వహించారు.
బిల్లుపై చర్చించడానికి వీలుగా – శాసనసభ శీతాకాల సమావేశాలను పొడిగించాల్సిన అవసరం ఉందని పంచాయితీ రాజ్ శాఖా మంత్రి జానారెడ్డి అభిప్రాయ పడ్డారు. అయితే శాసన సభలో తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభం కావడంపట్ల తెలంగాణా రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంతోషం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందు సభ ప్రొరోగ్ కాకపోగా, బిల్లు రాష్ట్ర శాసనసభకు రానున్న నేపథ్యంలో సభను ప్రొరోగ్ చేయించాలని, తర్వాత సభను ఎప్పుడు సమావేశ పరచాలనే నిర్ణయాధికారాన్ని తన చేతిలోకి తీసుకోవాలని సిఎం కిరణ్ భావించారు. ప్రొరోగ్ చేయాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. ఇది తెలంగాణ నేతలకు కోపం తెప్పించింది. ప్రొరోగ్కు ఒప్పుకునేది లేదు. ఒకవేళ స్పీకర్ లేఖ పంపించినా శాసనసభ వ్యవ హారాల మంత్రిగా ఆ ఫైలును నా దగ్గరే పెండింగ్‌లో పెడతాను అని శ్రీధర్ బాబు బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు స్పీకర్ నుంచి వచ్చిన ఫైలును పెండింగ్‌లో పెట్టి చూపించారు కూడా. దీంతో సభ ప్రొరోగ్ కాకుండా ఆగిపోయింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకుని, మంత్రి శ్రీధర్ బాబును శాసన సభా వ్యవహారాల శాఖ నుండి తప్పించారు. కాగా, శాసనసభ వ్యవహారాల శాఖను సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల కన్వీనర్‌గా, సమ్కెక్య పోరుకు నేతృత్వం వహిస్తున్న శ్కెలజానాథ్కు శాసనసభా వ్యవహారాలను అప్పగించడం విశేషం. 3వ తేదీ నుంచి విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనున్న అత్యంత కీలకమ్కెన సమయంలో శ్రీధర్ బాబును శాసనసభా వ్యవహారాల శాఖ నుండి తప్పించారు.
చివరికి మంత్రివర్గం సమావేశమ్కె శాసనసభ శీతాకాల సమావేశాలకు ముహూర్తం నిర్ణయించింది. డిసెంబర్ 16న స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టారు. అదే రోజు సభ వాయిదా పడి, తిరిగి సమావేశమ్కెన తర్వాత డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టు విక్రమార్క స్పీకర్ స్థానంలో ఉండగా బిల్లుపై చర్చకు శ్రీకారం చుట్టడం తదితరాలు క్రమానుగతంగా జరిగి పోయాయి.
గతంలో ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2013, 2014 జనవరి 30 న ఆంధ్రప్రదేశ్ శాసనసభ తిరస్కరించింది. 2014 బిల్లు 2014 ఫిబ్రవరి 18 న లోక్‌సభలో, 2014 ఫిబ్రవరి 20 న రాజ్యసభలో ఆమోదించబడింది. ఈ బిల్లును భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2014 మార్చి 1 న ధ్రువీకరించారు. అధికారిక గెజిట్‌లో 2014 మార్చి 2 న ప్రచురించారు, దీని ప్రకారం 2014 జూన్ 2 చట్టం ప్రకారం ‘నియమించబడిన రోజు’ అనగా కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించే రోజుగా ప్రకటించారు. బిల్లు రాష్ట్రపతి అంగీకారాన్ని పొంది 2014 మార్చి 1 న గెజిట్‌లో ప్రచురించింది. తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీ ( నియమించబడిన తేదీ)అనగా 2 జూన్ 2014 న భారతదేశంలోని 29 వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…




