– ప్రకృతి వనాలపై పగబట్టడం దుర్మార్గమైన చర్య
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకుని రెండేళ్లుగా విలవిల్లాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలనే మహోన్నత లక్ష్యంతో కేసీఆర్ నిర్మించిన ప్లలె ప్రకృతి వనాలపై కూడా పగబట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే నిర్దాక్షిణ్యంగా నరికివేయడం దారుణమని అన్నారు. పదేళ్లపాటు ఆహ్లాదకర వాతావరణంలో కళకళలాడిన ప్లలెలను అన్ని రకాలుగా ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపం రోజుకో రూపంలో బయటపడుతోందని తెలిపారు. ఇప్పటికే చెక్‌డ్యామ్‌లను పేల్చివేస్తున్నారని, చెరువులను చెరబట్టారని, వ్యవసాయాన్ని కుప్పకూల్చారని, కుల వృత్తులను కాలరాశారని పేర్కొన్నారు. ఇప్పుడు నీడనిచ్చే చెట్లను కూడా నరికేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఈ దుశ్చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘పల్లె కన్నీరు పెడుతుందో‘ అని మరోసారి పాడుకునే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ పార్టీపై రాష్ట్రంలోని ప్రతి గ్రామం తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





