20 మంది పేదలకు ‘డబుల్‌’ ఇం‌డ్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

చెమట చుక్క పడకుండా..రూపాయి ఖర్చు లేకుండా…  

దసరాకు సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం
త్రాగు నీటి వలయం..మంచినీళ్ల మణిహారంగా సిద్ధిపేట
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

సిద్ధిపేట/గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌రూపాయి ఖర్చు లేకుండా చెమట చుక్క పడకుండా రెండు పడక గదుల ఇండ్లను కట్టి పేదలకు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. మంత్రి హరీష్‌రావు సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌మండలం బెజగామలో రైతు వేదిక, డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌గృహా ప్రవేశాల కార్యక్రమంలో హాజరై లబ్ధిదారులను గృహా ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బెజగామ గ్రామంలో 20 మంది పేదలకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ దసరాకు ఇంటి అడుగు జాగలో ఇండ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో ఇండ్లు కట్టుకునేందుకు కేవలం 60 వేల రూపాయలు ఇచ్చేదనీ, ఆ డబ్బులు బేస్మెట్‌కు  కూడా సరిపోయేవి కావనీ, పైగా మధ్య దలారులకే డబ్బులు పోనూ, లోనూ రూపేణా 40 వేలు మీద పడి పోనూ కేవలం 10 వేలు చేతికి వొచ్చేవనీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన తీరును మంత్రి నిలదీసారు. సిఎం  కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ‌రాకముందు గజ్వేల్‌లో గత పాలకుల పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు.  కేసీఆర్‌ ‌వొచ్చాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విధానాలు వివరించారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ‌రైల్వే ఎరువుల తిప్పలు తప్పేలా..గజ్వేల్‌లో రైల్వే రేక్‌ ‌పాయింట్‌ ఏర్పాటు చేసి సిద్ధిపేట జిల్లా రైతుల తిప్పలను సిఎం కేసీఆర్‌ ‌తప్పించారని గుర్తు చేశారు. బెజగామలో 11కెవి విద్యుత్తు లైన్‌ ‌నూతనంగా కావాలని గ్రామస్తుల కోరిక మేరకు ప్రతిపాదన తీసుకుని, కావాల్సిన కొత్త విద్యుత్తు లైన్‌ను మంజూరు చేసి మరమ్మత్తు ప్రారంభించాలని విద్యుత్‌ అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. బెజగామ రవి చెరువు వద్ద బతుకమ్మ ఘాట్‌ ‌మెట్లు కావాలని కోరిక మేరకు వెంటనే నిర్మిస్తామని గ్రామస్తులకు మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్దిదారులకు ఆసరా గుర్తింపు కార్డులను అందజేసిన మంత్రి హరీష్‌రావు..మండలంలోని శేర్‌పల్లిలో 20 మంది లబ్ధిదారులకు రెండు పడకల గదుల గృహా ప్రవేశాల కార్యక్రమంలోనూ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వంటేరు యాదవరెడ్డి, ఫారుఖ్‌హుస్సేన్‌, ‌జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ఎఫ్‌డిసి చైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌ ‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌, ‌జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్‌ ‌లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా డిసిసిబి ఛైర్మన్‌ ‌చిట్టి దేవేందర్‌రెడ్డి, ఏఎంసి ఛైర్మన్‌ ‌మాదాసు శ్రీనివాస్‌, ‌వైస్‌ ‌ఛైర్మన్‌ ‌రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, ఎంపిటిసిల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు దేవి రవీందర్‌, ‌మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌నేతి చిన రాజమౌళి, ఎంపిపి దాసరి అమరావతి, వైస్‌ ఎం‌పిపి కృష్ణాగౌడ్‌, ‌జడ్పిటిసి పంగ మల్లేశం, పిఏసిఎస్‌ ‌ఛైర్మన్‌ ‌వెంకటేష్‌గౌడ్‌,  ‌సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్‌రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

త్రాగు నీటి వలయం..మంచినీళ్ల మణిహారంగా సిద్ధిపేట
సిద్ధిపేట నియోజకవర్గంలో కొత్తగా మరో ఏడు ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ‌త్రాగు నీటి ట్యాంక్‌లను నిర్మిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు. వాటి నిర్మాణాలకు 1కోటి 37 లక్షల రూపాయలు మంజూరైనట్లు మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..సిద్ధిపేట నియోజకవర్గం త్రాగు నీటికి..మిషన్‌ ‌భగీరథకు స్ఫూర్తి అని అన్నారు. ప్రతిష్టాత్మకంగా మిషన్‌ ‌భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన త్రాగునీరు ఇస్తున్నామనీ, అందులో భాగంగా  నియోజకవర్గంలో  ఇప్పటికే  371 ట్యాంకులుండగా మరో 7 కొత్తగా మంజూరు చేయడం జరిగిందన్నారు. నీటి కొరత ఉన్న గ్రామాల్లో ఈ ట్యాంక్‌లను నిర్మాణం చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో సిద్దిపేట జిల్లా కేంద్రం చుట్టూ త్రాగు నీటి వలయంగా 11 కిలో మీటర్ల  రింగ్‌ ‌మెయిన్‌ ‌కూడా ఏర్పాటు చేయనునట్లు చెప్పారు. సిద్ధిపేట రూరల్‌ ‌మండలంలోని బండచర్లపల్లి ఎస్సీ కాలనీలో  రూ.13.50 లక్షలతో  20వేల లీటర్ల ట్యాంక్‌, ‌నంగునూర్‌ ‌మండలంలోని నర్మెటలోని ఎస్సీ కాలనీలో  రూ.22 లక్షలతో 60వేల లీటర్ల ట్యాంక్‌, ‌సిద్దన్నపేటలో రూ. 22 లక్షలతో 60వేల లీటర్ల ట్యాంక్‌, ‌జెపి తండాలోనిని  లక్ష్మణ్‌ ‌తండాలో  రూ.13.50 లక్షలతో 20 వేల లీటర్ల ట్యాంక్‌, ‌ఘనపూర్‌లోని ఎస్సీ కాలనీలో  రూ.22 లక్షలతో 60 వేల లీటర్ల ట్యాంక్‌, ‌మగ్దూంపూర్‌లోని బిసి కాలనీలో, చిన్నకోడూర్‌ ‌మండలంలోని విఠలాపూర్‌లోని  విఠలేశ్వర స్వామి బండపైన రూ. 22 లక్షలతో 60 వేల లీటర్ల ట్యాంకులను నిర్మిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయనీ, త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి హరీష్‌రావు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *