– ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
– ఫైల్‌పై సంతకం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11: రాష్ట్రవ్యాప్తంగా మరో 18 ప్రత్యేక దత్తత కేంద్రాలు(SAAS), 2 బాలల సంరక్షణ కేంద్రాలు(Children Homes) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పూర్తికాగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆ ఫైల్‌పై శుక్రవారం సంతకం చేశారు. సీఎం ఆమోదం లభించిన వెంటనే ఈ కేంద్రాల ఏర్పాటుకు అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 15 జిల్లాల్లో 17 దత్తత కేంద్రాలు ఉన్నాయి. అదనంగా 18 కొత్త కేంద్రాల ఏర్పాటుతో వీటి సంఖ్య 35కి చేరనుంది. పిల్లల అక్రమ విక్రయాలు, అనధికార దత్తతలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనికి కొనసాగింపుగా దత్తత కేంద్రాలు, బాలల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రణాళికల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటయ్యే కేంద్రాల నిర్వహణ, పిల్లల బాగోగుల కోసం ఏటా రూ.5.44 కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు సిద్దం చేసింది. అందులో 60 శాతం (రూ.3.26 కోట్లు) కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 40 శాతం (రూ.2.17 కోట్లు) రాష్ట్రం భరించనున్నాయి. ఈ కేంద్రాల్లో సేవలందించేందుకు 228 మంది సిబ్బందిని అవుట్‌సోర్సింగ్ విధానంలో నియమించనున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని నిరాశ్రయ పిల్లల భద్రతకు, దత్తత ప్రక్రియ పారదర్శకతకు మరింత బలాన్ని చేకూర్చనుంది.





