– మంటలు చెలరేగడంతో 17మంది బుగ్గి
– క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స
– రాష్ట్రపతి , ప్రధాని మోడీ సంతాపం
బెంగళూరు,డిసెంబర్ 25: కర్నాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 17మంది సజీవ దహనమయ్యారు. మరో 13మంది గాయపడ్డారు. కంటెయినర్ లారీ డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి`48పై గోర్లత్తు క్రాస్ వద్ద గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 32మంది ప్రయాణికులు ఉన్నారు. చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల పరిధిలోని అధికార యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదానికి అతివేగం, పొగమంచు కారణమని భావిస్తున్నారు. బస్సుతోపాటు లారీకి కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్, కో డ్రైవర్ అందులోంచి దూకి తప్పించుకున్నారు. మరికొందరు ప్రయాణికులు అద్దాలను పగులగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. వారిలో గగన, రక్షిత అనే యువతులు ఉన్నారు. తమ స్నేహితురాలు రష్మి కనిపించడం లేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. ప్రయాణికుల్లో కొంతమందికి గాయాలు కావడంతో వారిని సిరా, హిరాయూరు హాస్పిటల్స్‌కు తరలించారు. ప్రయాణికుల్లో కొందరి పేర్లను అధికారులు గుర్తించారు. ఆ వివరాల ప్రకారం.. బస్సులో మంజునాథ్, సంధ్య, శశాంక్, దిలీప్, ప్రీతీశ్వరన్, వి.బిందు, కె.కవిత, అనిరుధ్ బెనర్జీ, అమృత, కల్పన, ప్రజాపతి, ఎం.శశికాంత్, విజయ్ భండారీ, నవ్య, అభిషేక్, హెచ్.కిరణ్‌పాల్, ఎం.కీర్తన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భార్రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎం రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
ఈ బస్సు వెంటే మరో బస్సు : తృటిలో తప్పించుకున్న స్కూల్ విద్యార్థులు
ఈ ప్రమాదం జరిగే సమయంలో మరో స్కూల్ బస్సు దగ్ధమైన బస్సుకు సమాంతరంగా ప్రయాణిస్తోంది. టి.దర్శహళ్లి నుంచి దండేలికి వెళ్తున్న ఓ టూర్ బస్సు ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సమాంతరంగా ప్రయాణించింది. ఈ టూర్ బస్సులో 42మంది విద్యార్థులు ఉన్నారు. ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో ఆ ప్రమాద ధాటికి స్కూల్ బస్సు కూడా అదుపు తప్పింది. ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సును వెనక నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కకు జారిందని, ఎలాంటి ప్రమాదం జరగలేదని ఐజీపీ రవికాంతేగౌడ వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





