- లక్ష్యం వైపు పడుతున్న అడుగులు
- సిద్ధిపేట నియోజకవర్గమంతా ఒకటే చర్చ
- స్వచ్ఛందంగా కదిలివస్తున్న ప్రలు…వివిధ సంఘాల ప్రతినిధులు
- ప్రగతి ప్రధాత హరీష్‌పై వెల్లువెత్తుతున్న అభిమానం
సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే, ఇప్పుడు సిద్ధిపేట నియోజకవర్గంలో అంతటా ఒకటే చర్చ. ఎవరిని కదిపినా ఒకటే మాట. నలుగురు గుమికూడితే చాలు అందరి నోట వినిపించే ఏకైక మాట. లక్షన్నర వోట్ల మెజారిటీ అని. ఇంతకు ఈ లక్షన్నర వోట్ల మెజారిటీ మాట ఏమిటో తెలుసుకుందా…ఒక వోటుతో గెలిచినా గెలుపుగానే భావిస్తారు. ఏ ఎన్నికల్లోనైనా 99 శాతం అభ్యర్థులు సాధారణంగా గెలవాలనే చూస్తారు. కానీ, సాధారణ గెలుపును అందించడానికి సిద్ధిపేట నియోజకవర్గ వోటర్లు సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నది. తమలో ఒకడిగా, తమ కుటుంబ సభ్యుడుగా, తమ కోసమే తపన పడుతున్న రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి, ప్రగతి ప్రధాత తన్నీరు హరీష్‌రావుకు నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అసాధారణ విజయాన్ని అందించాలనే అకుంఠిత లక్ష్యంతో ఉన్నట్లు పల్లెలు, పట్టణంలో చోటుచేసుకుంటున్న ఏకగ్రీవ తీర్మానాల కాపీలను అందిస్తున్న తీరుతో అర్థమవుతున్నది.
ఒక భారీ లక్ష్యాన్ని సిద్ధిపేట వోటర్లే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు స్పష్టంగా కనబడుతున్నది. అసాధారణ విజయమంటే ఆషామాషీ కాదనే విషయం తెలిసినా..ఎందుకు కాదనే రీతిలో అడుగులు వేస్తున్నారు. దీని కోసం పల్లెలన్నీ కదులుతున్నాయి. కులం, మతం తేడా లేకుండా అన్ని సంఘాలు ఏకమై తీర్మానం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు…సిద్దిపేట అభివృద్ధిలో తన జీవితాన్నే అంకితం చేశారు. ఇంత చేసిన హరీష్‌రావుకు వోటు వేసి రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎవరికివారే కంకణబద్దులవుతున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 93 వేల మెజారిటీని ఇచ్చారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1,18,699 వోట్ల మెజారిటీని దాటించారు. గత ఎన్నికల్లో ‘లక్ష వోట్ల మెజారిటీ’ని దాటించి తమ అభిమాన నేత తన్నీరు హరీష్‌రావుకు కానకుగా ఇచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు వొచ్చే నెల(నవంబర్)30న జరిగే ఎన్నికల పోలింగ్ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు.
2018లో వొచ్చిన 1, 18, 699వోట్ల మెజారిటీని అధిగమించి…ఈ దఫా 1,50,000 వోట్ల మెజారిటీ లక్ష్యాన్ని ఎవరికి వారుగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. పట్టణం, పల్లెలు, సంఘాలు, అసోసియేషన్లు, కులాలు, మతాలు, జాతులు ఇలా అన్ని వర్గాలు వారంతటగా వారే స్వచ్ఛందంగా వొచ్చి హరీష్‌ను ఆశీర్వదిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఒక సిద్ధిపేట నియోజకవర్గంలోనే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఉద్యమంలో, అభివృద్ధిలో, ఆదర్శంలో సిద్దిపేట నియోజకవర్గం చరిత్ర సృష్టించింది. రాబోయే ఎన్నికల్లోనూ హరీష్‌కు భారీ మెజారిటీతో చరిత్ర పుటల్లో నిలవాలనే ప్రజల ఆకాంక్ష రోజురోజుకూ బలంగా మారుతున్నది. రాష్ట్రమంతా గెలుపోటముల గురించి చర్చ జరుగుతుంటే కేవలం సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం మెజారిటీ గురించే చర్చ జరుగుతుంది. ఎవరిని కదిలించినా లక్షన్నర వోట్ల మెజార్టీ దాటుతుందనే ఒకే ఒక్క మాట వినిపిస్తున్నది. హరీష్‌రావును లక్షన్నర వోట్ల మెజారిటీతో గెలిపించి తమ అభిమానాన్ని చాటుకోవాలని సిద్ధిపేట ప్రజలు చూస్తున్నారు.





