15 ఆగస్టు 1947 త్యాగాలు – మిగిలిపోయిన కర్తవ్యాలు

నాటి స్పూర్తి ఏమైంది ఆ చరిత్ర చదవాలి,

సామాజిక తత్వ వేత్త
బి ఎస్ రాములు
ఫో. 8331966987

15 ఆగస్టు భారత స్వాతంత్ర దినోత్సవం. ఇది అందరికి తెలుసు. కాని దీని సుదీర్ఘ చరిత్ర ఎందరికి తెలుసు? ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో , ఎన్ని విషాదాలున్నాయో , ఎన్ని వేల లక్షల మంది త్యాగాలు బలిదానాలు. ఉరి శిక్షలు, ఎన్ని రకాల పోరాటాలున్నాయో ఎందరికి తెలుసు? ఒక్కసారి వికీపీడియాలో భారత స్వాతంత్ర దినోత్సవం అని వెతికితే వందల వేల వివరాలు . ఇంకా చేర్చకుండా ఉండిపోయినవి ఎన్నో! అవి యువతరం చదవాలి. తెలుసుకోవాలి. అపుడే స్వాతంత్రం యొక్క విలువ ప్రాధాన్యత తెలుస్తుంది. ఇపుడు అమెరికా అధ్యక్షుడు ఇండియాను బంతిని తన్నినట్టు ఆడుకుంటున్నాడు. స్వాతంత్ర సమర యోధుల స్పూర్తి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అమెరికాలో ఉండి మనవాళ్లు ఇండియా స్వాతంత్రం కోసం ఎత్తులు వేసారు. గదర్ పార్టీ వాళ్లు ఇపుడుంటేనా? అసలు ఇండియాను ముట్టుకునేవారా? బిర్సా ముండా బతికివుంటే ఇన్ని ఘోరాలు, చత్తీస్ లో కగార్ హత్యా కాండ చూస్తూ ఊరుకునేవాడా? అల్లూరి సీతారామ రాజు స్వదేశీ దోపిడి దొంగల్ని ఇలాగే వదిలేసే వాడా?

ఆదివాసుల త్యాగాలకు ఫలితం ?
తాము తరతరాలు నివసిస్తున్న అడవి మీద భూమి మీద ఎవరో వచ్చి మాది అని వారితో బలవంతంగా పని చేయించడం, రైలు పట్టాలకు చదును చేయించడం, రోడ్లు వేయించడం, దోపిడి దౌర్జన్యాలు , అత్యాచారాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వలస పాలన కాలంలో ఎక్కడి కక్కడ 170 గిరిజనులు తిరుగుబాట్లు చేసారు. ఎందరో రక్తం ధారపోస్తూ నేల కొరిగారు.

ఈ రహదారులు రైల్లు ఎవరు వేసారు?
ఈ నాడున్న జాతీయ రహదారులు , రైల్వే లైన్లు ఎవరి రెక్ల్కల కష్టంతో అభివృద్ది చెందాయో వారికేమైనా అందులో వారి అభివృద్ది ఏమైనా జరిగిందా? నేటికీ భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వనవాసుల వనాలను, వన సంపదను, భూములను తనవని ప్రకటించి నిర్వాసితులను చేస్తున్నారు. స్వాతంత్రం వారి ప్రాంతాలను లాక్కోవడానికే వచ్చిందా? కాకతీయులతో పోరాడిన చరిత్ర సమ్మక్క సారలక్కలది!

సుభాష్ చంద్రబోస్ పౌరుషమేది?
ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మించి యుద్దంతోనే బ్రిటిష్ వారిని తరిమేయడం సాధ్యం అని వేలాది సైన్యం సమకూర్చాడు సుభాష్ చంద్రబోస్ . ఆ పౌరుషమే ఉంటే అమెరికాలో ఉన్న భారతీయులను బేడీలు వేసి ట్రంప్ ఇండియాకు పంపేవాడా?

చక్రవర్తి చేసికొన్న 90 ఏండ్లకే మూడు ముక్కలవడం
మన స్వాతంత్ర ఫలాల కోసం ఎందరు ఎన్ని త్యాగాలు చేసారు? మొదటి స్వాతంత్ర పోరాటం 1857 లో జరిగినపుడు మా దేశానికి చక్రవర్తి బహదూర్ షా అని ప్రకటించుకున్నారు. 90 ఏండ్లు గడిచే సరికి మాకంటూ వేరే దేశం కావాలని మహమ్మదాలీ జిన్నా, ముస్లింలీగ్ ఒత్తిడితో మొఘల్ సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యంగా మారి చివరకు మూడు ముక్కలుగా విడిపోయింది. ఒక రోజు ముందే పాకిస్తాన్ స్వాతంత్ర జెండా ఎగిరింది. సరిహద్దులు గీసి మతాల వారీగా జనాభా తరలి పోయినపుడు హత్యలు మానభంగాలు దోపిడీలు ఎన్నని చెప్ప తరం? పది లక్షల మంది హత్లకు గురై రక్తం ప్రహించింది. ఆ రక్త సిక్త హత్యాకాండ సమయంలో రెండు దేశాధి నేతలు మహమ్మదలీ జిన్నా, జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర జెండా ఎగరేశారు. హతుల బంధువులు పిల్లలు ఆస్తులు ఎంత చిన్నాభిన్నమయ్యాయో ఎవరికి తెలుసు? భీష్మ సహానీ రాసిన తమస్ నవల కొండంతలో ఆవగింజంత! సల్మాన్ రష్దీ రాసిన అర్దరాత్రి స్వాతంత్రం మరో ఆవగింజ. స్వాతంత్రం ఊరికే రాలేదు. రెండువందల ఏళ్లుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. నెహ్రూ జెండా ఎగరేసే సమయంలో గాంధీ కలకత్తాలో అల్లర్ల మధ్య నిరసనగా నిరాహార దీక్షలో ఉన్నాడు.

అమెరికాకు స్వాంత్రం ఇచ్చిన బ్రిష్ వాళ్లు రెండు వందల ఏండ్లు ఎందుకు ఇండియాను పట్టుకొని పీడించారు? ఎందుకలా జరిగింది? యూరపు తెల్లవారి మరో దేశంగా అవరించినందున బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని వదిలేసి నల్లవాళ్ళ దేశంగా, అనైక్యత కారణంగా కొనసాగారా?శాశ్వతంగా పరిపాలన చేపట్టాలనే లక్ష్యంతో చట్టాలు, రైల్లు, రోడ్లు, విద్య సంస్థలు, సంఘ సంస్కరణలు చేపట్టారు. సంఘ సంస్కరణ ఉద్యమాలు ఆ సమయంలోనే రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనం వ్యతిరేక ధ్యమం , దయానంద సరస్వతి, మహాత్మా జ్యోతిరావు ఫూలే విద్య సంస్థలు, కందుకూరి వీరేశ లింగం విధవా వివాహాల సంస్కరణలు మొదలయ్యాయి.

రాజుల మధ్య కొట్లాటలో లాభపడ్డదెవరు?
టిప్పు సుల్తాన్ ఓడి పోయి మైసూరు ప్రాంతం బ్రిటిష్ వారి పరమైంది. టిప్పు సుల్తాన్ తో పోరాటంలో మద్దతు తీసుకున్నందుకు ఖర్చుల కింద నిజాం రాయలసీమను ధారాదత్తం చేసాడు. కరువు కాటకాల నివారణకు, పంట పొలాలకు నీరందించడానికి సర్ ఆర్ధ్రర్ కాటన్ హయాంలో ప్రాజెక్టులు కట్టారు.

నేటికీ విముక్తి పొందని భూములు
ఇలా సంస్కరణలు, అభివృద్ది పనులతో పాటు పరిపాలనలో భాగస్వామ్యం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. భూమిశిస్తు వసూలు చేయడానికి కొంత ప్రాంతానికి అధికారులుగా నియమించారు. వారిని జమీందార్లు జాగీర్ దారులు , మక్తదార్లు, భూస్వాములు అని పిలిచారు. 1840 నుండి మొదలైన ఈ వ్యవస్థ ప్రజలను పీడించి ఎదిగే వ్యవస్థగా మారింది. దాంతో వీరిపై తిరుగుబాట్లు మొదలయ్యాయి.

స్వాతంత్రంతో ఎవరికెంత వచ్చింది
1947 స్వాతంత్ర వచ్చింది. ముస్లింలకు పాకిస్తాన్ వచ్చింది. దళితులకు రిజర్వేషన్లు వచ్చాయి. బీసీలకు ఏం వచ్చింది? భూమి పన్ను కోసం పరిపాలన కోసం పెట్టిన జమిందారీ జాగిర్దారీ భూస్వామ్య వ్యవస్థ రద్దు కాలేదు. ప్రభుత్వ పరంగా దఖలు పడిన లక్షలాది ఎకరాలు వారి సొంత ఆస్తిగా మారి పోయాయి. అందువల్ల విద్య ఉద్యోగ రాజకీయ పరిపాలన న్యాయవ్యస్థ రంగాల్లో ఆధిపత్యంలోకి స్థిర పడ్డారు. అదే క్రమం నేటికీ సాగుతున్నది. భూములను ప్రభుత్వం తిరిగి వాపసు తీసుకొని జాతీయం చేయాలన్న అంబేడ్కర్ ఆశయం నెర వేరలేదు.

50 శాతం జనాభాకు అందని ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం
78 ఏండ్ల స్వాంత్రం తర్వాత కూడా బీసీలకు చట్ట సభలలో రాజ్యాంగ బద్ద ప్రాతినిధ్యం ఏర్పడలేదు. ఆదివాసులకు స్యయంపాలిత అవకాశాలు లేవు. ఇలా తమ ప్రాంతాలు తమవి కాకుండా పోయాయి. 50 శాతం జనాభా గల బీసీలకు చట్ట సభల్లో రాజ్యాంగ బద్దంగా ప్రాతినిధ్యం లేకుండా పోయింది.సమస్త రంగాల్లో వీరికి జనాభా దామాషా మేరకు రాజ్యాంగ బద్దంగా ప్రాతినిధ్యం కల్పించినపుడే 200 ఏండ్లుగా చేస్తున్న త్యాగాలకు సంపద ఉత్పత్తికి , ఉద్యమాలకు సమాన భాగస్వామ్యం అందుతుంది. అపుడే అందరికి నిజమైన సమాన స్వాతంత్రం !! నేటి 15 ఆగస్టు కర్తవ్యం ఇదే! అందుకు అందరు పూనుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *