- పర్యవేక్షించిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
- మండలాలవారిగా సన్నాహక సమావేశాలు
- కదం తొక్కుతున్న గులాబీ సైన్యాలు
హుస్నాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : గులాబీ బాస్ సిఎం కేసీఆర్ సభకు హుస్నాబాద్ ముస్తాబవుతుంది. ఈ నెల 15న ఆదివారం రోజు హుస్నాబాద్ పట్టణంలో తొలి ఎన్నికల ప్రచార సభలో సిఎం కేసీఆర్ పాల్గొననున్నారు. హుస్నాబాద్ నుండే మరోసారి ఎన్నికల శంఖారావానికి సిఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. హుస్నాబాద్ సభను బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంగళవారం ఆర్థిక ఆరోగ్య మంత్రి, ట్రబుల్ షూటర్ హరీష్ రావు.. ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హుస్నాబాద్‌లో సభాస్థలిని ఫిక్స్ చేసారు. హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న సబ్ స్టేషన్ వెనుక స్థలాన్ని బహిరంగ సభ కోసం చదును చేసే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ పనులను ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, అయన తనయుడు ఇంద్రనీల్, కరీంనగర్ సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు, కరీంనగర్ గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ బుధవారం పర్యవేక్షించారు.
మండలాలవారిగా జనసమీకరణకు సన్నాహాలు
రాష్ట్ర మంత్రి హరీష్ రావు..ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అధ్యక్షతన మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి సభ గురించి, సిఎం కేసీఆర్ పర్యటన గురించి దిశానిర్దేశం చేసారు. మండలాల వారిగా సమావేశాలు నిర్వహించి జనసమీకరణకు సన్నాహాలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అన్ని మండలాలతో పాటు హుస్నాబాద్ పట్టణంలో కార్యకర్తల సమావేశాలు జరిగాయి. గ్రామాల వారిగా జనసమీకరణకు లక్ష్యాలను నిర్దేశించారు. ప్రతి గ్రామం నుండి డప్పు చప్పుళ్లతో, కోలాటాలతో, నృత్యాలతో.. బతుకమ్మలు, బోనాలతో.. ఉత్సాహంగా తరలి వొచ్చేందుకు, పండగ వాతావరణంలో సభకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మధ్యాహ్నం మూడు గంటలవరకు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు యత్నాలు చేస్తున్నారు. బహిరంగ సభకు వివిధ మార్గాల నుండి వొచ్చే వాహనాలకు పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేసారు. అక్కడ పోలీసు సిబ్బందితో పాటు పార్టీ నేతలను సమన్వయం కోసం నియమిస్తున్నారు. సభకు వొచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు అందుబాటులో ఉంచుతున్నారు. సుందరంగా వేదికను నిర్మించనున్నారు. అధునాతన మైక్ సిస్టం, ఎయిర్ కండీషనర్లు ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభ ఏర్పాటు పనుల్లో ఇంద్రనీల్ ఆధ్వర్యంలో యువత ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. మరోసారి హరీష్ రావు పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సిఎం కేసీఆర్ హుస్నాబాద్ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.





