- సిఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ బెంగాల్ సిఎం మమత లేఖ
- 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు 22 మంది జాతీయ నేతలకూ ఆహ్వానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రపతి అభ్యర్థిపై కసరత్తు చేస్తుండగా రీజినల్ పార్టీల సందడి కూడా మొదలైంది. ఇందులో భాగంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ నెల15న దిల్లీలో జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్‌ను మమత ఆహ్వానించారు. 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు 22 మంది జాతీయ నేతలకు మమత లేఖ రాశారు.
రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక రాష్టాల్ల్రో పర్యటించారు. మరోవైపు దీదీ కూడా తన ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాష్ట్రపతి ఎన్నికలో బలమైన ప్రత్యర్థిని బరిలో నిలిపేందుకు మమత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ నెల 15న ఢిల్లీలో నిర్వహించే భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్ సీఎంలతో పాటు పలువురు ప్రముఖులకు దీదీ లేఖలు రాశారు.





