పేరు ఏదైనా ..ఇది వీర తెలంగాణ ..!

ప్రతీఏట సెప్టెంబర్‌ నెల వొచ్చిందంటే రాజకీయపార్టీల మధ్య  మాటల యుద్ధం మొదలవుతుంది. సెప్టెంబర్  17వ తేదీ భారతదేశ చరిత్రలో ఒక విశిష్టాత్మకమైన రోజు. అయితే ఆ రోజును ఏ పేరుతో పిలువాలన్న వివాదం  గత డెబ్బై ఏడు ఏండ్లుగా కొనసాగుతున్నది. నిరంకుశ నిజాం ప్రభుత్వ కబంధ హస్తాలనుంచి హైదరాబాద్‌ స్టేట్‌ అనే ఈ ప్రాంతానికి విముక్తి లభించిన ఈ రోజుకు ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో నామకరణ చేయడమే కాకుండా తాము పెట్టిన పేరు తోనే పిలవాలని వాదిస్తూ వొస్తున్నాయి. కాంగ్రెస్‌పార్టీ దీన్ని ‘తెలంగాణ విలీన దినోత్సవం’గా పిలిస్తే. కమ్యూనిస్టు పార్టీ ‘విద్రోహ దినం’గా పరిగణిస్తున్నది. భారతీయ జనతా పార్టీ దీన్ని ‘తెలంగాణ విమోచన దిన’మంటున్నది.

దురదృష్టం ఏమంటే ఎవరు ఏ పేరుతో పిలిచినా భారత స్వాతంత్య్ర పోరాటంలో తుది ఘట్టంగా నిలిచిన హైదరాబాద్‌ స్టేట్‌, భారత యూనియన్‌లో కలిసిన ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాల కాలంగా ఇక్కడ సంబరాలను జరుపుకోలేక పోవడం. భాషలపేరున ప్రాంతాలను విడదీసినప్పుడు హైదరాబాద్‌ సంస్థానానికి చెందిన కొన్ని ప్రాంతాలను ఇటు మహారాష్ట్రలో, అటు కర్ణాటకలో కల్పినప్పటికీ ఆ ప్రాంతాలవారు నాటినుండి నేటివరకు ఈ రోజున సంబరాలను జరుపుకుంటుంటే,  తెలంగాణ ప్రజలు మాత్రం ఉత్సవాలకు నోచుకోలేకపోయారు. స్వాతంత్య్రానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌, టిడిపి ప్రభుత్వాలే ఎక్కువకాలం కొనసాగాయి. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత ప్రజలు అమ అస్తిత్వం కోసం దశాబ్దాల కాలంగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు.

      దాదాపు రెండు వందల సంవత్సరాలకు పైగా అణచివేతకు గురైన ఈ ప్రాంతప్రజలు చేసిన అనేక రకాల పోరాటాలకు 1948 సెప్టెంబర్‌ 17న విముక్తి లభించింది. అది కూడా దేశంలోని వివిధ సంస్థానాలకు స్వేచ్ఛ లభించిన పదమూడు నెలల తర్వాత. అఖరి రాజ్యంగా హైదరాబాద్‌ సంస్థానం విలీనం కావడానికి స్థానిక ప్రజలు వందల సంఖ్యలో బలిదానాలు చేయాల్సి వొచ్చింది. అయినా ఈ ప్రాంతాన్ని స్వేచ్ఛగా ఎనిమిది కాలాలపాటు ఉంచలేక పోయారు. భాషాప్రయుక్త రాష్ట్రాలంటూ ఆంధ్ర ప్రాంత ప్రజలతో కలిపి ఆంధ్రప్రదేశ్‌గా నామకరణ చేసినప్పటినుండి మళ్ళీ ఈ ప్రాంతానికి కష్టాలు మొదలైనాయి. 1956 సెప్టెంబర్‌ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డ తర్వాత నాటి పాలకులు కూడా సెప్టెంబర్‌ 17 ప్రాధాన్యతను విస్మరించారు. పైగా స్వాతంత్య్రానికి ముందులాగానే ఈ ప్రాంతం పైన వారు కనబర్చిన వివక్షపై పోరాటం చేయక తప్పలేదు.  దశలవారీగా చేసిన పోరాటాలకు 2014లో మరోసారి ఈ ప్రాంతానికి విముక్తి లభించింది. అయితే నిజంగానే ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికైనా సంతోషంగా ఉన్నారా అన్నది మరో ప్రశ్న.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఈ పదకొండు సంవత్సరాల కాలంలో రెండు ప్రభుత్వాల పాలనను ప్రజలు చవిచూసారు. గత పదేళ్ళ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలోఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలపట్ల దొందు దొందే అన్నది ప్రజలు వెలువరుస్తున్న  అభిప్రాయం. ఆనాడు ప్రజలకిచ్చిన హామీలన్నిటినీ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయినట్లే, దాదాపు రెండు సంవత్సరాలుగా పాలనచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరి కూడా ఉందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం కనిపిస్తున్నది.
కనీసం బస్తా యూరియా దొరకటమే గగనమైంది. నేటికి దాదాపు నెల రోజులకు పైగా రైతులు తమ వ్యవసాయ పనులను పక్కకు పెట్టి యూరియా కోసం చేతాడుకు రెండింతల పొడవైన క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి …!. మరో పక్క ఆరోగ్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రైవేటు హాస్పిటల్స్  యాజమాన్యం ప్రకటించింది. ఇంకో పక్క ఫీ రీయింబర్సమెంటు సకాలంలో చెల్లించడం లేదని విద్యార్దుల ఆందోళన, గురుకుల విద్యార్ధుల మరణాలు, ఉపాధి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోలేదన్న నిరుద్యోగ యువకుల ఆందోళలు.. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా స్వేచ్ఛను అనుభవించ లేకపోతున్నారన్న భావన ఏర్పడుతున్నది. ఇలాంటి పరిస్థితిలో సెప్టెంబర్‌ 17ను ఏ పేరుతో పిలిస్తే ఏమిటన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముందుగా మనం చెప్పుకున్నట్లు నిజాం నిరంకుశ పాలననుండి విముక్తి లభించిన సెప్టెంబర్‌ 17కు ఇప్పటివరకు ఉన్న పేర్లు సరిపోవని మరో రెండు కొత్త పేర్లను తెలంగాణను ఏలిన రెండు పార్టీలు నామకరణం చేసాయి . సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉద్యమకాలంలో పట్టుబట్టిన బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వొచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోలేదన్న అపవాదను మూటగట్టుకుంది. రాజకీయ పార్టీలు, తెలంగాణ వాదుల ఒత్తిడితో చివరకు 2023లో  ‘జాతీయ సమైక్యతా దినోత్సవంగా’ ఉత్సవాలను నిర్వహించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ప్రజాపాలనా దినోత్సవం’ పేరున గత ఏడాది నుండి ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరం కూడా అదే పేరున అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంచార్జి మంత్రులు జాతీయ పతాకాల ఆవిష్కరించాలని ప్రభుత్వం   ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఖమ్మంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ  మాత్రం గతంలోలాగా విలీనం పేరుతోనే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.
ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ గత అయిదు సంవత్సరాలుగా అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని’ నిర్వహిస్తున్నది. గత సంవత్సరం రాష్ట్ర రాజధానిలో నిర్వహించిన విమోచన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పాల్గొనగా, ఈసారి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విచ్చేయనున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం కూడా అదేరోజున రావడంతో ఈ నెల 17నుండి అక్టోబర్‌ 2 వరకు పదిహేను రోజులపాటు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆ పార్టీ సంకల్పించింది. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, ప్రభుత్వ హాస్పిటల్స్ , పాఠశాలల్లో సేవా కార్యక్రమాలతో పాటు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధులను సన్మానించనుంది. ఇదిలాఉంటే గత సంవత్సరం అంటే 2024 మార్చ్‌ 12న  కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను ప్రతీఏటా విమోచన దినంగా జరుపుకోవాలని ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఇంతకాలంగా విమోచన, విలీనం, విద్రోహంతోపాటు కొత్తగా జాతీయ సమైక్యతా దినోత్సవం, ప్రజాపాలన దినోత్సవాలంటూ చేస్తూ వొస్తున్న నామకరణాలకు ఇకనైనా ఫుల్ స్టాప్  పడుతుందేమో చూడాలిమరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *