స్పౌజ్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు వివేక్
ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకున్న స్పౌజ్ బాధితులు
13 జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు
కన్నీటి పర్యంతమైన మహీళా ఉపాధ్యాయినీలు
ప్రతివారం వివిధ జిల్లాల నుంచి వచ్చి విన్నపాలు
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : 2023 జనవరిలో అప్పటి ప్రభుత్వం కేవలం 615 స్పౌజ్ బదిలీలను మాత్రమే జరిపిందని ఇంకా 1500 స్పౌజ్ బదిలీలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తమ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత తొందరగా స్పౌజ్ బదిలీలు జరిపించాలని మంగళవారం ప్రజా వాణిలో ఎమ్మెల్సీ ఎవిఎన్ రెడ్డిని, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్థన్ రెడ్డిని తెలంగాణ స్టేట్ స్పౌజ్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు వివేక్ బృందం కలిసి వేడుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అశాస్త్రీయ విధానాల మూలంగా మెమో నెం.8/1655 ప్రకారం భార్యా, భర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులను ఒకే జిల్లాకు చేర్చాల్సి ఉన్న 19 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు జరిపి,13 జిల్లాలను బ్లాక్ లో ఉంచింది. దీని కారణంగా ఉద్యోగస్తులైన భార్య, భర్తలు వివిధ జిల్లాలకు విసిరివేయ బడ్డారన్నారు. భర్త ఒక జిల్లాలో, భార్య మరో జిల్లాలో, పిల్లలు ఒకదగ్గర, వృద్ధులైన తల్లిదండ్రులు ఇంకొక దగ్గర, దీని మూలంగా కుటుంబ వ్యవస్థచిన్నా భిన్నమైందన్నారు. రెండు సంవత్సరాల నుంచి ధర్నాలు ర్యాలీలు పిల్లలతో సహా రోడ్డెక్కిన కూడా గత ప్రభుత్వం కనికరించలేదని, ఈ సమస్యలో ముఖ్యంగా మహిళలే 85 శాతం ఇబ్బందికి గురి అవుతున్నారన్నారు. రోజు వందల కిలోమీటర్ల ప్రయాణాలు చేయలేక, పనిచేసే చోట కుటుంబాలను విడిచి ఉండలేక,
ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. శాసన మండలీలో జీవో 317, స్పౌజ్ బదిలీలు, ఇతర విద్యాశాఖ సమస్యల విషయంలో త్వరలోనే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా సంతోషకరమన్నారు. సాధ్యమైనంత తొందరగా స్పౌజ్ బదిలీల సమస్య పరిష్కరామవుతుందనీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్లు అర్చన, విజయలక్ష్మీ, కృష్ణ, నరేష్, ఆనందం, జావీద్ తదితరులు పాల్గొన్నారు.




