11. జనధర్మోవిజయతే
ప్రజాతంత్ర దిన పత్రికలో ఎం ఎస్ ఆచార్యగారి జీవన సమరం గురించి జనధర్మో విజయతే పేరుతో రియల్ గా వస్తున్న వ్యాసాలలో ఇది నెంబర్ 11. ఆచార్యగారి షష్టి పూర్తి అభినందన సంచిక, సంపాదకీయా ఎడిట్ చేసిన సందర్భంలో రచించిన వ్యాసంలో ఒక భాగం ఇది. ఇందులో వ్యక్తిగా సమాన్యత్వం, కలంలో అక్షరం దైన్యం ఉండదనీ, అసిధారావ్రతంగా సాగిన శ్రీ ఆచార్య సంపాదక రచనలు లలిత పదవిన్యాసంతో సాగుతూనే, పదునుగా, భావ గాంభీర్యంతో, బిగువయిన రచనా సంవిధానంతో, కర్తవ్య భావనిష్ఠతో, ఏ వెరపూ లేని ధీరత్వంతో నిండి ఉంటుందనీ, ఈ అన్నింటి అవలోకనం, అనుశీలనం, అన్వయం, సమన్వయం ఆయన రచనల్లో జాల్వారుతూ ఉంటాయనీ శ్రీ ఆచార్య సంపాదకీయ రచనలు ఏనాడూ సర్దుబాటు మనస్తత్వాన్ని ప్రదర్శించిన దాఖలాలు లేవు.
అవసరం వచ్చినప్పుడు ఎంతటి వారినయినా స్వపర భేదం లేకుండా పాళీని రామబాణంలా ఎక్కుబెట్టి ప్రయోగించడమే ఆయనకు తెలిసిందనీ, ఎంత చౌకబారుగా తయారయి మౌలికంగా హాని కలిగిస్తుందో సూటిగా, నిర్ద్వంద్వంగా రాయగల శ్రీ ఆచార్య ‘సాహసం’ ఇటీవలి సంపాదకీయాల్లోనూ సువ్యక్తం. బహుశః ప్రతి కక్షీయులకు గూడా ఇది సాధ్యం కాదేమో అనీ, జనధర్మకు గుత్త పెట్టుబడిదారుల అండదండలు లేవనీ, ఒక పార్టీ ఒక వర్గం ఆలంబన అంతకన్నా లేదనీ, ‘త్వమేవ శరణం’ అని కాలక్షేపం చేయగల శక్తి గానీ, ఆసక్తి గానీ అసలే లేదనీ తమ పత్రిక ‘పాలసీ’ అనీ సంపాదక మండలి ప్రస్తావించింది. ఇక ప్రశ్న ఈ వ్యాస రచయిత ఎవరు? ప్రముఖ రచయిత కీర్తిశేషులు ఇందుర్తి ప్రభాకర్ గారు. ప్రేమతో రంగరించి, దశాబ్ద సంవత్సరాల పత్రికా రచనా రంగంలో అనుభవాన్ని సొబగులు దిద్ది, అతియోక్తి లేకుండా జాగ్రతపడి రచించిన కీలక మైన వ్యక్తి. సంపాదక మండలి. ఈ రచనలో ఎం ఎస్ ఆచార్య ఇంటర్య్యూలు, సమాచార సేకరణలో నేను పాల్గొన్నాను.
కలం, కాలం, సమన్వయం, తాత్కాలికత, భావుకత, నిర్దుష్టత, నిర్దిష్టత వేటికీ భంగం లేకుండా పునర్నూతనత్వం సంతరించుకొనే శైలి
తరువాత రెండో భాగంలో సంపాదక మండలి మరోవిశేషమైన విశ్లేషణ ఉంటుంది. చూడండి: ముప్పయి సంవత్సరాల సుదీర్ఘ కాలంలో సమస్యలు, అవసరాలు, రాజకీయ ధోరణులు – పరిణామాలు, అభివృద్ధి పనులకోసం సాగే నిరంతర ప్రకటనావశ్యకతలు ఏదో ఒక్కసారిగా తారసపడి తీక్షపడేవి కావు. సమస్యలు, వివరణలు, ఆపన్నతలు, విన్నపాలు, విచారణలు, వ్యాఖ్యలు నిరంతరం సాగేవి కావటాన అప్పుడప్పుడు పునరుక్తాలుగా, చర్విత చర్వణాలుగా భాసించే అవకాశం ఉంది. ఒక్కొక్క సందర్భాన్ని పురస్కరించుకొని పూర్వం చెప్పిన అంశాలే పునః పునః వ్యాఖ్యానించవలసిన అవసరమూ రావచ్చు. కాని, అట్లాంటి సందర్భాల్లో గూడా కలం, కాలం, సమన్వయం, తాత్కాలికత, భావుకత, నిర్దుష్టత, నిర్దిష్టత వేటికీ భంగం కలక్కుండా, పునర్నూతనత్వం సంతరించుకొనే విధంగానే రాయగలగడం రచనా రంగంలో విశేషానుభవానికి పరీక్షగా నిలుస్తుంది. ఆ పరీక్షకు శ్రీ ఆచార్య సంపాదకీయాలు తట్టుకొని నిలద్రొక్కుకున్నవి. ఆ సంపాదకీయాలకు విషయ ప్రాధాన్యమే కాక, సాహిత్యపు విలువలు, ప్రసూణాలుకూడ సంతరించటం గమనించవచ్చు.
చమత్కార వ్యంగ్యం: ప్రత్యేకమయిన ‘ఆచార్య ముద్ర’
శ్రీ ఆచార్య సంపాదకీయాలకు ఒక ప్రత్యేకమయిన ‘ఆచార్య ముద్ర’ ఉంటుంది. ఆయన భాషా ప్రయోగంలో ‘చమత్కారం’ అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుంది. శైలిలో ఒక విధమయిన ‘తెలంగాణా’ యాస పొట మరించి చమత్కరింపజేస్తుంది. సూటిగానే, ఋజువుగా భావం బలంగా వ్యక్తీకరిస్తూనే వ్యంగ్యాన్ని సంతరించు కొంటుంది. శీర్షికలు రూపొందించటంలోనూ, విషయం మొదలు పెట్టడంలోనూ, ముగించటంలోనూ చురుకయిన రచన ఆకట్టుకుంటుంది. ఈ అన్నింటికీ ఈ సంకల నంలో ఉదాహరణలు కొల్లలుగా లభిస్తాయి.
మూడునాలుగువేల సంపాదకీయాలు.
జనధర్మ. వరంగల్ వాణి పత్రికల మొత్తం మీద శ్రీ ఆచార్య సంపాదక రచనలు దాదాపు మూడు నాలుగు వేల దాకా ఉంటాయి. ఇన్నింటిలో కొన్నింటిని ఎన్నిక చేసుకొని – ఆ ఎన్నిక కూడా ఈ సంకలనాన్ని వెలువరించే అభినందన సమితి అవకాశాలూ, పరిమితులూ దృష్టిలో ఉంచుకొని చేయటం అంత సులభమేమీకాదనే అంశం మాకు అనుభవం మీద తెలియవచ్చింది. సంపాదకీయాలు అంతస్సూత్రం ఒకటే అయినా, వస్తువు – భావం – భావుకత మొదలయిన అంశాలను బట్టి ఇన్నిన్ని సంపాదకీయాల్లో దేనికదే ఒక మేలిమి, ఒక మెరుపు కలిగి ఉంటుంది. ఈ ఎంపికచేసే వారి ఉత్సాహానికీ, ప్రచురణ పరిమితులకూ పొంతన కుదురనప్పుడు ఈ ఎంపిక మరింత కష్టతరంగా తయారవుతుంది, అయింది కూడా. అంతేకాదు. సంపాదకీయాలను ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేయాలి? ఏ విధంగా వర్గీకరించాలి? ఏయే వర్గంలో ఎన్నెన్ని సంకలనం చేయటం? – ఇవి ఇబ్బంది పెట్టిన సమస్యలు.
కాలక్రమాన్ని ఆనుసరించాలా? విషయాన్ని అనుసరించాలా? అనేవీ సమస్యలే. ఇన్నిన్ని సమస్యలతో, ప్రశ్నలతో శ్రీ ఆచార్య సంపాదకీయాలన్నింటిని అనుశీలించే అవకాశం ఈ సంకలన సంపాదక మండలికి ఒక విచిత్రమయిన, విశిష్టమయిన అనుభవం. అధ్యయన శీలంతో ఎంపిక చేసిన సంపాదకీయాలను ఒక క్రమంలో కూర్చడానికి ఒక భూమికను సమకూర్చుకొని ముందుకు సాగాల్సి వచ్చింది. ఆ భూమిక శ్రీ ఆచార్య సంపాదకీయాల్లో విస్తృతంగా కన్పించే విషయ వస్తు వైవిధ్యం కేవలం కాలక్రమానికి కాక, వస్తు ప్రాధాన్యం ప్రాతిపదికపై రెండు పత్రికలలోని సంపాదకీయాలను సమిష్టిగానే భావించి, స్థూలంగా సప్త సోపానాలుగా – సప్త విభాగాలుగా చేయడమయింది. ఆయా విభాగాల్లోనూ కాలక్రమం స్థూలంగా ఎక్కడయినా ఒకటి రెండు వెనుకముందులున్నా పాటించబడిరది.





