మాడ్రిడ్‌, ‌జులై 25 : స్పెయిన్‌ ‌పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు.  ఆల్బెర్టో నునెజ్‌ ‌ఫెయిజో నేతృత్వంలోని కన్సర్వేటివ్స్‌కు అధిక స్థానాలు వచ్చినా మెజార్టీకి చాలా దూరంలో నిలిచింది. ఆ పార్టీ  మిత్రపక్షమైన వోక్స్‌తో జట్టు కట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ లేదు. లెప్ట్ ‌నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవడంతో అధికారం చేజిక్కించుకోవాలన్న ఆల్బెర్టో సునెజ్‌ ఆశలు అంత సులువుగా నెరవేరే స్థితి కానరావడం లేదు. పెడ్రో శాంచెజ్‌ ‌నేతృత్వంలో సోషలిస్టులు గత ఎన్నికలతో పోల్చితే సీట్లు, ఓట్లు పెంచుకున్నారు. భావ సారూప్యత గల సుమేర్‌, ఇతర పార్టీలు, గ్రూపులను కలుపుకుని ప్రభుత్వ ఏర్పాటుకు వారు కూడా ప్రయత్నిస్తున్నారు. వారం రోజుల క్రితం వరకు 168 సీట్లు గెలుచుకుని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కలలు గంటూ వచ్చిన పాపులర్‌ ‌పార్టీకి ఈ ఫలితాలు ఒకింత షాకిచ్చాయనే చెప్పాలి.

మొత్తం 350 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభలో సాధారణ మెజార్టీకి 176 సీట్ల రావాల్సి ఉండగా ఆ పార్టీకి 136 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే, 2019 నవంబరులో జరిగిన ఎన్నికలతో పోల్చితే 47 సీట్లు అది అధికంగా సాధించింది. మరో వైపు దాని మిత్ర పక్షమైన మతతత్వ పార్టీ వోక్స్ ‌బలం 52 నుంచి 33కి పడిపోయింది. ఈ రెండు పార్టీలు కలిసినా మ్యాజిక్‌ ‌ఫిగర్‌ (176) ‌కు ఏడు సీట్లు తక్కువ. చిన్న చిన్న గ్రూపులుగా ఉన్న సిసి, యుపిఎన్‌ ‌వంటి వాటితో అది జట్టు కట్టినా దాని బలం 171 సీట్ల వద్దే ఆగిపోతున్నది. కాబట్టి ఫెయిజో ప్రధాని కావడం చాలా కష్టం. సోషలిస్టు నాయకుడు శాంఛెజ్‌ ‌పరిస్థితి కూడా నల్లేరు ద నడకే కాదు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అనేక అడ్డంకులను దాటాల్సి ఉంది. సోషలిస్టు పార్టీ (పిఎస్‌ఒఇ)‌కి 122 సీట్లు రాగా, దాని మిత్రపక్షమైన సుమర్‌కు 31 స్థానాలు వచ్చాయి. 2019 ఎన్నికలతో పోల్చితే పిఎస్‌ఒఇకి రెండు సీట్లు పెరగ్గా, సుమర్‌కు నాలుగు సీట్లు తగ్గాయి. ఈ రెండు పార్టీలకు కలిపి 153 సీట్లు వచ్చాయి. ఇతరులకు 28 స్థానాలు లభించాయి. వీరు ఎటువైపు మొగ్గు చూపుతారనేదానిపై రెండు ప్రధాన కూటముల భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *