– కేసుల దర్యాప్తులో ఎఫ్‌ఎస్ఎల్ ఎంతో ముఖ్యం
– ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంపై ప్రత్యేక బృందం దర్యాప్తు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్ఎల్)లో ఈనెల 7న జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నాగ్‌పూర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ బృందం 1,100 ముఖ్యమైన ఫైళ్లు కాలిపోయినట్లు కనుగొంది. ఫైళ్ల నుండి డేటాను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు అయితే రికవరీ కష్టమేనని ఆ బృందం తెలిపింది. ఈనెల 10న సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫఎసఎల్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్, నాగ్‌పూర్ వంటి జాతీయ సంస్థల నిపుణులు అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. వివిధ కేసుల దర్యాప్తులో ఎఫ్‌ఎస్ఎల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో వెంట్రుకలు, ఎలక్ట్రానిక్ డివైజ్‌ల విశ్లేషణ, రక్తం, వేలిముద్రలు, బుల్లెట్లు, లేదా డీఎన్‌ఏ నమూనాలు, ఆయుధాలు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగాయా లేదా ప్రతీది ఇతర అన్ని ఆధారాలను ల్యాబ్‌లోనే పరిశీలించి నివేదికలు సిద్ధం చేస్తారు. ఈ ఆధారాలు ఎన్నో కోర్టు తీర్పుల్లో కీలకంగా ఉంటాయి. కానీ ఈ ప్రమాద ప్రభావం కేసుల దర్యాప్తుపై ఎంతవరకు పడనుందనేది ఆందోళనకరమైన విషయం. కాగా, 2015లో ఓటుకు నోటు కేసుతో సహా హై ప్రొఫైల్ కేసులకు సంబంధించిన పదార్థాలు అగ్ని ప్రమాదంలో నాశనమయ్యాయని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలు పూర్తిగా అబద్ధం అని డీజీపీ కొట్టిపారేశారు. అగ్ని ప్రమాదంపై నిపుణులతో సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. నివేదిక కోసం ఎదురు చూస్తున్నాము. కొంత నష్టం జరిగినప్పటికీ సర్వర్ల ద్వారా దానిని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తాము. స్థానిక ఎఫ్‌ఎస్ఎల్ బృందంతోపాటు నిపుణులు సర్వర్ల నుండి డేటాను తిరిగి పొందడానికి ప్రయత్నాలు చేస్తారు’ అని డీజీపీ నాడు చెప్పిన విషయం విదితమే. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వంటి హై-ప్రొఫైల్ కేసులకు సంబంధించిన ఆధారాలు తగులబడ్డాయనే దాన్ని టీజీఎఫ్‌ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయెల్ ఈనెల 8న తోసిపుచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



