ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 అర్థ రాత్రి నుండి 24 గంటల పాటు అన్ని రకాల ట్రాన్స్ పోర్ట్ వాహనాల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రవాణా రంగ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) తెలిపింది. ఈ మేరకు సోమవారం హైదర్ గూడా ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ ఎస్ దయానంద్, కో-కన్వీనర్ టి.రాజశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రవాణా రంగం నుండి ప్రతి ఏటా పన్నుల రూపేనా వేలాది కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ రవాణా రంగ కార్మికుల అభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ఓలా ఉబర్ వచ్చిన తర్వాత డ్రైవర్లపై దాడులు పెరిగిపోయాయని తక్షణమే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలలో ఉన్న మాదిరిగా ప్రత్యేక యాప్ ను రూపొందించాలని కోరారు. హైదరాబాద్ లో ఆటోలకు కొత్త పర్మిట్లను మంజూరు చేయాలని, లారీలకు సింగిల్ పర్మిట్ విధానం తీసుకు రావాలని, పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు మల్లేష్ గౌడ్, మహమ్మద్ సలావుద్దీన్, ఎండి ఆశమ్, బి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.




