హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని కొల్లూరులో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామని శేర్లింగంపల్లి డిసిపి సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. అక్రమంగా గంజాయిని నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను కొల్లూరు పోలీసులు, మాదాపూర్ ఎస్‌ఓటీ సిబ్బంది సంయుక్తంగా అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బస్వ జగన్నాథం (37), పల్లపు లక్ష్మీనారాయణ (52) అనే వ్యక్తులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి వ్యాపారానికి అలవాటు పడ్డారన్నారు. ఒడిశాకు చెందిన రాజు అనే వ్యక్తి నుంచి సుమారు 101.7 కిలోల గంజాయిని తెప్పించి, తెల్లాపూర్ పరిధిలోని శిల్పా వెంచర్ సపంలో కార్మికుల క్యాంపుల వద్ద విక్రయించేందుకు నిల్వ చేశారని పేర్కొన్నారు.ఖచ్చితమైన సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడి నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 25.72 లక్షల విలువైన గంజాయితో పాటు నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన ప్రధాన నిందితుడు రాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని డీసీపీ పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన కొల్లూరు సీఐ గణెళిష్ పటేల్, ఎస్‌ఓటీ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించి, రివార్డులు అందజేస్తామని ప్రకటించారు. గంజాయి లేదా మాదకద్రవ్యాల సరఫరాపై సమాచారం ఉంటే డయల్ 100 లేదా సైబరాబాద్ ఎన్‌డీపీఎస్ సెల్ వాట్సాప్ నంబర్ 9490617444కు ఫిర్యాదు చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





