ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్

– రూ.5వేల కోట్ల పెట్టుబడులు.. 4వేల మందికి ఉపాధి
– యూపీసీ వోల్ట్‌తో తెలంగాణ ఒప్పందం

దావోస్, ప్రజాతంత్ర, జనవరి 22: దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ’ బృందం దావోస్‌లో యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రిన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రిన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్ తో  ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ వోల్ట్ సంస్థగా ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన డేటా సెంటర్? నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్ సరఫరాకు 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే మూడువేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగావకాశాలుంటాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్ధిని సాధించడమే రాష్ట్ర లక్ష్యమని స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అధునాతన ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నెట్ జీరో సిటీ అభివృద్ధే తెలంగాణ విజన్‌లో భాగమన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా పాల్గొన్నారు.

దావోస్ ప‌ర్య‌ట‌న స‌క్సెస్‌ : రూ.5.75ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు

హైద‌రాబాద్‌: ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. గత నెలలో హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. మూడు రోజుల వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులోనూ ఆశించిన లక్ష్యాన్ని సాధించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 2026 సదస్సులో పెట్టుబడులకు మించి తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో ప్రతినిధుల బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగం హైదరాబాద్ లో వరల్డ్ ఎకనమిక్ ఫాలో అప్ ఫోరమ్ నిర్వహించాలనే ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించింది.మూడు రోజుల్లో ప్రపంచస్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *