– మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా కార్యాచరణ
– ప్రతీ శాఖ వంద రోజుల కార్యాచరణను సిద్ధం చేయాలి
– మార్చి 1న జిల్లా కలెక్టర్లతో సిఎం రేవంత్ సమావేశం
– అధికారుల సమావేశంలో సిఎస్ రామకృష్ణారావు ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై 100 రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు వెల్లడించారు. ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు ,ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ వంద రోజుల కార్యక్రమంలో అన్ని శాఖల వారీగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సచివాలయంలో గురువారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సి.ఎస్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. స్పెషల్ సి.ఎస్ లు జయేష్ రంజన్, వికాస్ రాజ్ ,సి.వీ ఆనంద్ సంజయ్ కుమార్ , మహేష్ దత్ ఎక్కా, సబ్యసాచి ఘోష్, నవీన్ మిట్టల్, దాన కిషోర్, అహ్మద్ నదీమ్, తదితరులు హాజరైన ఈ సమావేశంలో సిఎస్ మాట్లాడుతూ, ఈ వంద రోజుల కార్యక్రమంపై ఈ నెల 28న నిర్వహించే కార్యదర్శుల సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారని తెలిపారు. అదేవిధంగా మార్చ్ 1వ తేదీ ఆదివారం జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 2వ తేదీ నుండి జూన్ 9 వ తేదీ వరకు వివిధ అభివృద్ధి పనులపై ప్రతీ శాఖ తమ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని, జిల్లా కలెక్టర్ల సమావేశంలో చర్చనీయాంశాలు వెంటనే రూపొందించాలన్నారు. ఈ సందర్బంగా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని ఇందుకుగాను ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ భవనాలను సిద్ధం చేయాలనీ అన్నారు. ప్రధానంగా గ్రాణాభివృద్ధి, మున్సిపల్, హెల్త్, ఎడ్యుకేషన్, పంచాయితీ రాజ్, వ్యవసాయం, రెవెన్యూ, పర్యాటక, పరిశ్రమలు, మహిళా శిశు సంక్షేమం, గృహనిర్మాణం, రెవెన్యూ, విద్యుత్, కార్మిక తదితర అన్ని శాఖలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సి.ఎస్ పేర్కొన్నారు. ముఖ్యంగా, పారిశుధ్యం గ్రాణాభివృద్ధి ఆరోగ్య తదితర కార్యక్రమాలపై నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లకు అవగాహన చైతన్య కార్యక్రమాల మాదిరిగా కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సచివాలయం తోపాటు హెచ్.ఓ.డిలలో ఈ-ఆఫీస్ ను అమలు చేయాలని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




